ఎవరి నోట విన్నా కొవిడే! ఏ ఆసుపత్రి చూసినా మహమ్మారి గుబులే! కొవిడ్ కేసుల తీవ్రత ఇతర అన్నిరకాల చికిత్సలపైనా ప్రభావం చూపిస్తోంది. నాన్-కొవిడ్ సమస్యల్లో అత్యవసరమైతేనే ఆసుపత్రులకు రావాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ.. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులనే తేడా లేకుండా బాధితులతో పడకలన్నీ నిండిపోతున్నాయి. జిల్లా కేంద్రాలు, రెవెన్యూ డివిజన్లలోని అన్ని ప్రభుత్వాసుపత్రులు, చాలావరకూ ప్రైవేట్ వైద్యశాలలు కొవిడ్ ఆసుపత్రులుగా మారిపోయాయి.
కొవిడేతర ఆసుపత్రులపై రోగుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. వీలైనంత మేర ఓపీలను నిలిపివేసిన ఆసుపత్రులు.. ఫోన్ ద్వారా రోగులతో మాట్లాడుతున్నారు. గతంలో ఇచ్చిన మందులు కొనసాగించాలని సూచిస్తున్నారు. పరీక్షలకు సంబంధించిన రిపోర్టులూ ఆన్‌లైన్‌లోనే చూసి తగు మందులు సిఫారసు చేస్తున్నారు. వివిధ విభాగాల నిపుణులు సైతం ప్రస్తుతం కొవిడ్ వైద్యంలో తలమునకలై ఉన్నారు. ఇలాంటి విపత్కాలంలో నాన్-కొవిడ్ సమస్యలున్నవారు అత్యవసరమైతేనే ఆసుపత్రికి రావాలని వైద్యులు సూచిస్తున్నారు.