ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

GGH Sanitation: పడకేసిన పారిశుద్ధ్యం.. లక్షలు పోసినా కానరాని శుభ్రత.. ఇబ్బందుల్లో రోగులు - సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్

No Sanitation in GGH: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం పడకేసింది. నెలకు లక్షల రూపాయలు తీసుకుంటున్న గుత్తేదారు.. నిబంధనల ప్రకారం పనులు చేపట్టడం లేదు. కొన్ని వార్డుల్లో వాసన భరించలేక ముక్కు మూసుకుని పోవాల్సిందే. అపరిశుభ్ర పరిస్థితుల నడుమ రోగులు, సహాయకులు గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.

GGH Sanitation
GGH Sanitation

By

Published : Jul 17, 2023, 8:41 PM IST

పడకేసిన పారిశుద్ధ్యం.. లక్షలు పోసినా కానరాని శుభ్రత.. ఇబ్బందులు పడుతున్న రోగులు

No Sanitation in GGH: గుంటూరు ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో పారిశుద్ధ్యం కోసం.. నెలకు లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్నా.. ఫలితాలు ఆశించినంతగా ఉండటం లేదు. గుత్తేదారుకు నెలకు 82 లక్షల 95వేల రూపాయలు.. అంటే రోజుకు సగటున 2 లక్షల 75 వేలకుపైగా ఖర్చు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛత మార్గదర్శకాలను అనుసరించి.. పారిశుద్ధ్య పరిస్థితుల్ని మెరుగుపర్చేందుకు కృషి జరగాలి. స్వచ్ఛత మార్గదర్శకాలు ప్రామాణికంగా తీసుకుని.. సర్వజనాస్పత్రిలో పారిశుద్ధ్యంఎలా ఉందో ఖరారు చేయాల్సి ఉండగా.. అధికారులు తమకు తోచినట్లు నివేదికలు ఇస్తున్నారు. కొత్త సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ ఆస్పత్రిలో అనేక విభాగాలను తనిఖీ చేస్తున్న సమయంలోనూ.. పారిశుద్ధ్యం బాగా లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒత్తిళ్లకు లొంగి నివేదికలు ఇస్తే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

ఆస్పత్రిలో పరిసరాలు బాగా లేని ప్రాంతాలను గుర్తించి.. సూపరింటెండెంట్ స్వయంగా కొన్ని చోట్ల చీపురుతో శుభ్రం చేశారు. ఆస్పత్రిలో అనేక చోట్ల దుర్గంధం వెదజల్లుతోంది. జీజీహెచ్ 18 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉండగా.. నిత్యం వైద్యసేవలు పొందడానికి రోజుకు 2 వేల నుంచి 2వేల 500 మంది వరకు రోగులు వస్తుంటారు. వీరందరి రద్దీని దృష్టిలో ఉంచుకుని 24 గంటలు పని చేసేందుకు 240 మంది పారిశుద్ధ్య కార్మికులు, 26 మంది పర్యవేక్షకులు ఉండేలా గుత్తేదారుతో అధికారులు ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందాన్ని ఓ పక్కనపెట్టి వార్డుల్లో నచ్చినట్లుగా పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి.

నిబంధనల ప్రకారం రోజుకు రెండు సార్లు కాల్వలు శుభ్రం చేయాలి. నీరు ఎక్కడా ఆగిపోకుండా ప్రవహించేలా చూడాల్సి ఉంది. ఏదైనా నిర్వహణ అవసరమైతే.. రెండు గంటల్లో సరిచేయాల్సి ఉంది. వార్డుల పై నుంచి ఏర్పాటు చేసిన పైపుల్లో నుంచి.. నీరుకారి గోడలు పాచిపట్టి పచ్చగా కనిపిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఎప్పుడో తప్ప కాల్వల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం లేదు. నీటి నిల్వ చేసే ట్యాంకులు, సెప్టిక్ ట్యాంకు, పైకప్పులను ప్రతి నెలా శుభ్రం చేయాల్సి ఉండగా.. అదీ సక్రమంగా అమలు కావడం లేదు. సన్ షేడ్స్ రోజుకు రెండుసార్లు, గోడలు, సీలింగ్ ప్రతి 15 రోజులకు ఒకసారి శుభ్రం చేయాల్సి ఉండగా.. పట్టించుకునేవారే కరవయ్యారు.

ఆస్పత్రి.. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ఆఫ్ హాస్పిటల్స్ గుర్తింపును సాధించాలన్నా వార్డులను ఎంతో పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరముంది. ఉదయం 8 గంటలకే విభాగాలన్నీ శుభ్రం చేయాల్సి ఉండగా.. వారంతా ఆరు బయట పనిచేసి 8 గంటల తర్వాతే లోపలికి వస్తున్నారు. దీనివల్ల వైద్యులు వచ్చే సమయానికి వార్డులు శుభ్రం చేస్తూనే ఉంటున్నారు. కార్మికులు సెలవులో వెళ్లినప్పుడు, వారాంతపు సెలవులిచ్చినప్పుడు వారి స్థానంలో ఎవరినీ నియమించకుండా చాలా సార్లు ఉన్నవారితోనే సర్దుబాటు చేసి పని చేయిస్తుంటారు. GGHలో అపరిశుభ్ర పరిస్థితులను సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ దృష్టికి తీసుకురాగా.. పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపర్చేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు వివిధ జిల్లాల నుంచి గుంటూరు జీజీహెచ్​కు వైద్యం కోసం తరలివస్తారు. ఇంతటి కీలకమైన ఆస్పత్రిలో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపర్చాల్సిన అవసరముంది. ప్రభుత్వ ఉన్నతాధికారులు నివేదికలపై ఆధారపడకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు చేపట్టాలని రోగులు వారి సహాయకులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details