NO RTC Bus Facility for Villages in AP:గ్రామాల్లో ఉండే ప్రజలు నిత్యం తమ అవసరాల కోసం సమీప పట్టణాలు, మండల, నియోజకవర్గ కేంద్రాలకు వెళ్లాలంటే ఎక్కువగా అర్టీసీనే ఆశ్రయిస్తారు. సురక్షిత ప్రయాణం, ప్రైవేటు వాహనాలతో పోల్చితే తక్కువ ఛార్జీల కారణంగా.. ఎక్కువగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణాలకే మొగ్గు చూపుతారు. కానీ, ఏపీఎస్ఆర్టీసీ మాత్రం అన్ని పల్లెలకు బస్సులు నడిపేందుకు మొగ్గుచూపడంలేదు. గిట్టుబాటు కాదని, రూట్ కనెక్టివిటీ ఇవ్వలేమని.. ఇలా రకరకాల కారణాలతో పలు గ్రామాలకు బస్సులు నడపడంపై దాటవేత ధోరణి అవలంబిస్తోంది.
ఏపీఏస్ఆర్టీసీ నిత్యం 3 వేల 510 రూట్లలో బస్సులు నడుపుతుండగా.. ఇవి 14 వేల 213 గ్రామాల మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. అయినా రాష్ట్రవ్యాప్తంగా ఇంకా ఆర్టీసీ బస్సులు తిరగని గ్రామాలు 3 వేల 669 ఉన్నాయి. మా ఊళ్లకు బస్సు నడపండి మహాప్రభో అంటూ ఆయా గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు వేడుకున్నా ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడంలేదు. ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే.. పరిశీలిస్తామని హామీ ఇచ్చి, తర్వాత దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నారు.
How to Apply TSRTC Student Bus Pass : ఆన్లైన్లో బస్పాస్.. ఇంటి నుంచే పొందండిలా..!
జగన్ ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీలో బస్సుల సంఖ్య ఏటా తగ్గిపోతోంది. అత్యధిక కిలోమీటర్లు తిరిగి కాలంచెల్లిన బస్సుల స్థానంలో ఎప్పటికప్పుడు కొత్తవి కొనుగోలు చేయడంలేదు. దీంతో గత నాలుగేళ్లలో ఏసీ మినహా, మిగిలిన అన్ని రకాల సర్వీసులు సంఖ్య తగ్గిపోయింది. ఆర్టీసీలో 2019లో మొత్తం బస్సుల సంఖ్య 11 వేల 770 కాగా.. వైసీపీ అధికారంలో ఉన్న గత నాలుగేళ్లలో 866 బస్సులు తగ్గి 10 వేల904కి చేరింది.
సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్ ప్రెస్ వంటి నాన్ ఏసీ బస్సులు 4 వేల 439 ఉండగా.. ప్రస్తుతం 568 బస్సులు తగ్గిపోవడంతో 3 వేల 871 మాత్రమే నడుపుతున్నారు. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో నడిపే ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ సిటీ బస్సుల సంఖ్య 13వందల 43 నుంచి వెయ్యి 67కి చేరింది. అంటే నాలుగేళ్లలో 276 సర్వీసులు తగ్గిపోయాయి. గ్రామీణుల ప్రయాణించే పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు బస్సులు 5 వేల648 నుంచి 5 వేల504 సర్వీసులకు తగ్గాయి. ఈ లెక్కన పల్లె బస్సుల్లో 144 కనుమరుగయ్యాయి. గత నాలుగేళ్లలో కేవలం ఏసీ సర్వీసులు మాత్రమే పెరిగాయి. 2019లో 340 ఏసీ సర్వీసులు నడపగా.. ప్రస్తుతం 462 బస్సులు ఉన్నాయి.