No Response to YSRCP Samajika Sadhikara Bus Yatra :రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న సామాజిక సాధికారిక యాత్ర, సభలు ఆ పార్టీ నేతలకు చేదు అనుభవాలు మిగుల్చుతున్నాయి. బ్యానర్లు కట్టి, అట్టహాసంగా సభలు నిర్వహించినప్పటికీ ప్రజాదరణకు మాత్రం నోచుకోవడం లేదు. గుంటూరు జిల్లా పొన్నూరులో నిర్వహించిన వైఎస్సార్సీపీ సామాజిక సాధికార సభ జనం లేక వెలవెలబోయింది. మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ (Chellaboina Venugopal Krishna), జోగి రమేష్ (Jogi Ramesh)తో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ సభకు హాజరయ్యారు. సభ కోసం వాహనాలు ఏర్పాటు చేసి డ్వాక్రా మహిళలను, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను తీసుకొచ్చారు. సభ ప్రారంభం కాక ముందే జనమంతా. మమ్మల్ని వదిలేయండి మేముండలేం మహోప్రభో అంటూ తిరిగి వెళ్లిపోయారు. చేసేది లేక మంత్రులు ఖాళీ కుర్చీలను ఉద్దేశించి ప్రసంగాలు ఇచ్చారు.
తుస్సుమన్న వైసీపీ బస్సు యాత్ర - బారికేడ్లు పెట్టి బతిమలాడినా జారుకున్న జనం
People Facing Problems with Traffic Disruption with YCP Meeting :శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో నిర్వహించిన సామాజిక సాధికారిక బస్సు యాత్ర తుస్సుమంది. ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష, మంత్రి ఉషశ్రీ చరణ్ పాల్గొన్న ఈ బస్సుయాత్ర హిందూపురంలో అంబేడ్కర్ కూడలికి చేరుకున్నాక బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సమీకరించిన జనమంతా సభ ప్రారంభమైన కొద్దిసేపటికి తిరిగి వెళ్లిపోయారు. LED స్క్రీన్‌లు పెట్టి హడావుడి చేసి అట్టహాసంగా నిర్వహించినా పట్టుమని వెయ్యి మంది కనిపించలేదు. ఇంక చేసేది లేకసభను తూతూమంత్రంగా నడిపించేశారు. అంతకుముందు నగరంలో వైఎస్సార్సీపీ నిర్వహించిన సామాజిక సాధికారిక బస్సు యాత్ర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలను తెచ్చిపెట్టింది.
వైఎస్సార్సీపీ అత్యుత్సాహం..ట్రాఫిక్ జామ్ :బస్సుయాత్ర బహిరంగ సభకు వెళ్లే ప్రాంతంలో బారికేడ్లు పెట్టడంతో ప్రభుత్వ ఆస్పత్రి ప్రధాన ద్వారం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. రొల్ల ప్రాంతం నుంచి కాన్పు కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన ఓ గర్భిణిని అత్యవసర చికిత్స కోసం వైద్యులు అనంతపురం రిఫర్ చేశారు. వైఎస్సార్సీపీ వాళ్ల అత్యుత్సాహం వల్ల గర్భిణి వెళ్తున్న 108 వాహనం అరగంట పాటు ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయింది. ఎట్టకేలకు స్థానికులు సహాయంతో ట్రాఫిక్ నుంచి బయటపడి 108 వాహనం అనంతపురం వైపు వెళ్లడంతో గర్భిణీ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.