ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

NO Relief Actions on Drought Situation In AP జగనన్న.. రైతన్న గోడు వినిపించడం లేదా! వర్షాభావ పరిస్థితులపై మొద్దు నిద్ర వీడేది ఎప్పుడు..? - farmers worried about deficit rainfall

NO Relief Actions on Drought Situation In APరాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. మెజారిటీ జిల్లాల్లో కరవు ఛాయలతో రాష్ట్రవ్యాప్తంగా పంటల సాగు తగ్గింది. ఎండిన పంటలను చాలాచోట్ల తొలగిస్తున్నారు. మొత్తంగా సాగయ్యే సాధారణ విస్తీర్ణంలో 56 శాతమే పంటలను వేశారు. చేసేది లేక నీరింకిన కళ్లతో నింగికేసి చూస్తున్న రైతుల గోడు.. జగన్‌ ప్రభుత్వానికి పట్టడం లేదు. ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టడం లేదు.

NO Relief Actions on Drought Situation In AP
NO Relief Actions on Drought Situation In AP రైతు గోడు వినిపించడం లేదా.

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 28, 2023, 7:18 AM IST

Updated : Aug 28, 2023, 8:22 AM IST

NO Relief Actions on Drought Situation In AP రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వర్షాభావం తీవ్రమవుతోంది. బెట్టబారినపడి వేరుసెనగ, కంది, పత్తి ఇతర పంటలన్నీ ఎండిపోతున్నాయి. నీరందక మాగాణులు నెర్రెలిస్తున్నాయి. నారుమళ్లు ఎండిపోతున్నాయి. అక్కడక్కడ జల్లులు పడుతున్నా పంటలకు ఊపిరి పోయలేకపోతున్నాయి. మళ్లలోనే మిరప నారు ముదిరిపోతోంది. అన్నమయ్య, నెల్లూరు, వైయస్‌ఆర్‌, అంబేడ్కర్‌ కోనసీమ, శ్రీసత్యసాయి, పశ్చిమగోదావరి, పల్నాడు, తిరుపతి, ప్రకాశం, అనంతపురం, కాకినాడ, నంద్యాల, ఎన్టీఆర్‌ జిల్లాల్లో సాధారణ వర్షపాతం కన్నా తక్కువగా నమోదవడంతో రైతులు పంటలను కాపాడుకోవడానికి ఆగచాట్లు పడుతున్నారు. వరి నారుమడిని కాపాడుకునేందుకు రైతుల డబ్బాలతో నీరు చల్లుతున్నారు. మరికొన్న చోట్ల పొలాల్లోకి పైపులు వేసి పంట తడపుతున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నా ప్రత్యామ్నాయ సాగు ప్రణాళికలో ప్రభుత్వం జాప్యం చేస్తోంది.

కనీసం బోర్ల కింద ఉన్న పంటలనైనా కాపాడుకుందామంటే విద్యుత్తు సరఫరా సరిగా లేదు. రైతులు సబ్‌స్టేషన్ల ముందు ఆందోళన చేయాల్సి వస్తోంది. కొన్నిచోట్ల తెల్లవారుజామున విద్యుత్తు సరఫరా చేస్తున్నారు. మరికొన్నిచోట్ల మూడు గంటలే ఇస్తున్నారు. కొన్ని చోట్ల ట్యాంకర్లను తెప్పించి పంటలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఖరీఫ్‌లో సాధారణ విస్తీర్ణం 85.97 లక్షల ఎకరాలుగా ఉండగా.. ఆగస్టు 23 నాటికి 47.90 లక్షల ఎకరాల్లోనే పంటలు వేశారు. సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే ఇది 38 లక్షల ఎకరాలు తక్కువ. గతేడాది ఇదే సమయానికి సాగయిన విస్తీర్ణంతో పోలిస్తే 16.3 లక్షల ఎకరాలు తగ్గింది. వరి సాగు 3.45 లక్షల ఎకరాలు తగ్గింది. 16.10 లక్షల ఎకరాల్లో వేరుసెనగ వేయాల్సి ఉండగా 7 లక్షల ఎకరాల్లోనే సాగయింది. పత్తిసాగు కూడా 60 శాతానికే పరిమితమైంది. 5.95 లక్షల ఎకరాల్లో సాగయ్యే కంది 2.73 లక్షల ఎకరాల్లోనే వేశారు.

'ఎండ మండుతోంది.. పైరు ఎండుతోంది'.. మరో రెండు రోజుల్లో అలా జరగకుంటే..!

నీరు లేక ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. గతేడాది ఇదే సమయానికి ఉన్న నీటి నిల్వలు లేవు. తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో నీరు లేదు. జులై 15వ తేదీనే సాగర్‌ కాల్వలకు నీరిస్తామన్న షెడ్యూల్‌ ఇప్పటికీ అమలు కాలేదు. వెలుగోడు, సోమశిల, కండలేరులోనూ సాగుకు సరిపడా నీరు లేదు. సాధారణ విస్తీర్ణంతో చూస్తే ప్రకాశం జిల్లాలో అత్యంత తక్కువగా 12 శాతమే పంటలు సాగయ్యాయి. అనకాపల్లి జిల్లాలో 24శాతం, బాపట్ల జిల్లాలో 25 శాతం మాత్రమే పంటలు వేశారు. సీఎం సొంత జిల్లా వైయస్‌ఆర్, పక్కనే ఉన్న అన్నమయ్య జిల్లాల్లోనూ 27శాతం విస్తీర్ణంలోనే పంటలు వేశారు. 9 జిల్లాల్లో సగటున సాగు 50 శాతంలోపే ఉంది. కృష్ణా, గోదావరి డెల్టాల్లో చివరి భూములకు సాగు నీరు అందడం లేదు.

కర్నూలు, అనంతపురం, నంద్యాల, శ్రీసత్యసాయి తదితర జిల్లాల్లో వర్షాభావంతో పత్తి, వేరుసెనగ పంటలు ఎండుతున్నాయి. బెట్టకు తెగుళ్ల తీవ్రత పెరగడంతో కొన్ని చోట్ల పంటను తొలగిస్తున్నారు.పల్నాడు, ఎన్టీఆర్, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో మిరప నారు పోసి నాటేందుకు నిరీక్షిస్తున్నారు. అదును దాటిపోవడంతో మళ్లలోనే నారు పెరుగుతోంది. వానలు లేక నాటే పరిస్థితీ లేదు. నంద్యాల జిల్లా అవుకు మండలం గుండమ్మనాయనపల్లెలో వర్షాలు లేక మినుము ఎండిపోవడంతో పొలంలో పశువులను వదిలేశారు. కొన్నిచోట్ల పత్తి, మొక్కజొన్న పైర్లను కాపాడుకునేందుకు ట్యాంకర్లను తెప్పిస్తున్నారు. ఒక్కో ట్యాంకరుకు 600 నుంచి 800 వరకు వెచ్చిస్తున్నారు.

Farmer Burnt Banana Crop: పది నెలలు గడిచినా రాని అరటి గెలలు.. మనస్థాపంతో చెట్లకు నిప్పు

వైయస్‌ఆర్, అన్నమయ్య జిల్లాల్లో మొత్తం 66 మండలాలు ఉండగా 46 మండలాల్లో వర్షాభావం, 15 మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులున్నాయి. అంటే 92 శాతం మండలాల్లో వానలు సరిగా లేవు. 3.91 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణానికి 97 వేల ఎకరాల్లోనే అంటే 25శాతం మేరే పంటలు వేశారు. వైఎస్సార్ జిల్లాలో 54 వేల ఎకరాల పత్తి వేయాల్సి ఉంటే.. 17 వేల ఎకరాల్లోనే వేశారు. అన్నమయ్య జిల్లాలో 1.05 లక్షల ఎకరాల్లో వేరుసెనగ వేయాల్సి ఉండగా.. 33 వేల ఎకరాల్లోనే సాగు అయ్యింది. ఇవీ ఎండుముఖం పడుతున్నాయి. పులివెందుల నియోజకవర్గం వేముల మండలం కొండ్రెడ్డిపల్లెలో వేరుసెనగ పంట ఎండిపోతుంది. సొంత జిల్లా రైతులపైనా ముఖ్యమంత్రి జగన్‌ కనికరం చూపడం లేదు.

ఉమ్మడి కడప జిల్లాలో 2018 ఆగస్టునాటికి సాధారణంతో పోలిస్తే వర్షపాతం తగ్గింది. వర్షాలు అనుకూలించక పత్తి వేయలేదు. దీంతో ప్రధానమంత్రి ఫసల్‌ బీమా కింద 5,395 మంది రైతులకు సంబంధించి 9 వేల 600 ఎకరాలకు 111 కోట్ల బీమా ఇచ్చారు. పంట వేయకపోయినా బీమా అందించే ఏర్పాట్లుచేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు వైయస్‌ఆర్, అన్నమయ్య జిల్లాల్లో సాధారణంకంటే 40 శాతం నుంచి 50శాతం తక్కువగా వానలు కురిశాయి. ఖరీఫ్‌లో రాష్ట్రంలోనే అత్యంత తక్కువగా 12 శాతం విస్తీర్ణంలోనే ప్రకాశం జిల్లాలో పంటలు వేశారు. అవీ వాడిపోతున్నాయి. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో పశుగ్రాసంగా సాగు చేసిన జొన్న ఎండుముఖం పట్టింది. పశుగ్రాసం కొరత నెలకొంది.

Interview With Dr. Ashok on Anantapuram Crops: చిరుధాన్యాలు సాగుచేస్తే నష్టం తప్పించుకోవచ్చు: డా. అశోక్‌

NO Relief Actions on Drought Situation In AP జగనన్న.. రైతన్న గోడు వినిపించడం లేదా!
Last Updated : Aug 28, 2023, 8:22 AM IST

ABOUT THE AUTHOR

...view details