AIIMS : గుంటూరు జిల్లా మంగళగిరిలో 16 వందల18 కోట్ల వ్యయంతో ఎయిమ్స్‌కు 2015 డిసెంబరులో శంకుస్థాపన జరిగింది. 2019 మార్చి 12 నుంచి సేవలు మొదలయ్యాయి. అత్యాధునిక నిర్మాణాలు, వసతులతో రూపుదిద్దుకుంటున్న ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ సేవలు పేద, మధ్యతరగతి వారికి తక్కువ ధరలో అందుబాటులోకి వస్తున్నాయి. అలాంటి ఈ ఆసుపత్రికి రోజుకు 15 నుంచి 20 లక్షల లీటర్ల నీరు అవసరం. ప్రస్తుతం 2 నుంచి 3 లక్షల లీటర్లను మంగళగిరి- తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ వారు ఉచితంగా అందిస్తున్నారు. ఈ నీటిని ట్యాంకర్ల ద్వారా ఆసుపత్రికి తెచ్చేందుకు నెలకు 5 లక్షల ఖర్చును ఎయిమ్స్ భరిస్తోంది.
మరో మూడు లక్షలు అధనంగా ఇవ్వాలని లేఖలు : ఓపీ ద్వారా రోజూ 15 వందల మంది వరకు వైద్యం పొందుతున్నారు. 950 వరకు ఇన్‌పేషంట్ పడకల ఏర్పాటుకు అవకాశముంది. అయితే.. 125 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత నిర్మాణాలకు తగ్గట్లు 400 పడకలను అదనంగా వెంటనే ఏర్పాటు చేసేందుకు వీలుంది. ఎంబీబీఎస్‌లోనూ సీట్లు పెరిగాయి. 2022-23 విద్యా సంవత్సరం నుంచి పీజీ, నర్సింగ్‌లోనూ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ పరిస్థితుల్లో అత్యవసరంగా రోజు మరో 3 లక్షల లీటర్ల నీటిని అదనంగా ఇవ్వాలని ఎయిమ్స్ అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి వైద్యారోగ్యశాఖ, మున్సిపల్, కార్పొరేషన్ కమిషనర్ల స్థాయి వరకు కొద్దికాలంగా లేఖలు రాస్తూనే ఉన్నారు.
అదనంగా 3 లక్షల లీటర్ల నీటిని మంగళగిరి- తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ వెలుపలి నుంచి ఇవ్వాల్సి ఉన్నందున చెల్లింపులు జరగాల్సిందేనని ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. తొలుత పేర్కొన్నట్లు రోజుకి 72 వేల 162 కాకున్నా.. కనీసం సాధారణ స్థాయిలోనైనా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. దీని ప్రకారం రోజుకి 35వేల వరకు కార్పొరేషన్‌కు చెల్లించాల్సి వస్తుందని తెలిసింది. ఈలెక్కన చెల్లింపులు జరిపి, నీటిని మంగళగిరి ఎయిమ్స్‌కు ట్యాంకర్ల ద్వారా తెప్పించేందుకు నెలకు అదనంగా మరో 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా.