Police Jobs Notification in AP: ఏటా 6,500 చొప్పున పోలీసు ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని చెప్పిన సీఎం జగన్.. అధికారం చేపట్టి నాలుగేళ్లు దాటుతున్నా ఒక్కటంటే ఒక్క పోలీసు ఉద్యోగమూ ఇవ్వలేదు. ఉద్యోగ ప్రకటన విడుదలై ఎనిమిది నెలలవుతున్నా ఇప్పటి వరకూ దేహదారుఢ్య, శారీరక్ష సామర్థ్య పరీక్షలు నిర్వహించలేదు. కనీసం అవి ఎప్పుడు జరుపుతారో కూడా స్పష్టతివ్వడం లేదు. కనీసం విడుదల చేసిన నోటిఫికేషన్ మేరకైనా ఉద్యోగాల భర్తీ సకాలంలో పూర్తి చేయకపోవటం ఏంటి? సీఎం గారూ.. పోలీసు ఉద్యోగాలు ఇంకెప్పుడు ఇస్తారు? దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షల నిర్వహణ షెడ్యూల్ ప్రకటించేందుకు మీకు ఇంకెన్నాళ్లు పడుతుంది? ఏటా 6,500 చొప్పున పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయటం అంటే ఇదేనా? ఇది నిరుద్యోగుల జీవితంతో చెలగాటంఆడటం కాదా?
జాబ్ క్యాలెండర్‌లో 10వేల143 ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న సీఎం.. అందులో 450 పోలీసు పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. అదేంటి వేల ఖాళీలుంటే 450 పోస్టులు మాత్రమే భర్తీ ఏంటని.. ఆశావహులు కంగుతిన్నారు. పోనీ వాటికైనా నోటిఫికేషన్ ఇచ్చారా అంటే.. అదీ లేదు. ఆ తర్వాత తీరిగ్గా 6,100 కానిస్టేబుల్, 411 ఎస్సై ఉద్యోగాల భర్తీ కోసం గతేడాది నవంబరు 28న రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటి ప్రాథమిక రాతపరీక్ష ఫలితాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలయ్యాయి. అర్హత సాధించిన వారికి రెండో దశలో దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నా.. 4 నెలలుగా పట్టించుకున్న పాపాన పోలేదు.
కొత్త షెడ్యూల్ మాటే లేదు..కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఈ ఏడాది మార్చి 13 నుంచి 20వ తేదీ వరకూ పీఈటీ, పీఎంటీ పరీక్షలు నిర్వహిస్తామంటూ అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. తర్వాత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వాటిని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆ ఎన్నికల ప్రక్రియ ముగిసిపోయి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ కొత్త షెడ్యూల్ మాటే లేదు. ఎస్సై ఉద్యోగాలకు సంబంధించిన ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు నిర్వహించాల్సిన పీఎంటీ, పీఈటీ పరీక్షల షెడ్యూల్‌ను కూడా ఖరారు చేయలేదు.
ఉద్యోగాలు భర్తీ చేయటం అంటే ఇదేనా?..ఉద్యోగ ప్రకటన విడుదలై 8 నెలలు కావొస్తున్నా ఇప్పటి వరకూ దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించకపోవడంపై.. పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కనీసం ఎప్పుడు నిర్వహిస్తారో కూడా స్పష్టత ఇవ్వకపోవడంతో.. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక పరీక్షల్లో అర్హత సాధించిన 1.53 లక్షల మంది అభ్యర్థులకు నెలల తరబడి నిరీక్షణ తప్పట్లేదు. సీఎం జగన్ ఇచ్చిన హామీని ఎప్పటిలోగా నిలబెట్టుకుంటారంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీ మేరకు జాబ్ క్యాలెండర్ ఎటూ ఇవ్వట్లేదు. కనీసం విడుదల చేసిన నోటిఫికేషన్ మేరకైనా ఉద్యోగాల భర్తీ సకాలంలో పూర్తి చేయకపోవటం ఏంటని.. నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఏటా 6,500 చొప్పున పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయటం అంటే ఇదేనా? అని.. సీఎం సారుని నిలదీస్తున్నారు.