ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విక్రయాలు జరగక.. గోదాముల్లో చోటులేక..! - selling of mirchi in guntur mirchi yard news

మిర్చి ధరలు పడిపోయిన కారణంగా పంటను అమ్ముకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు మిర్చి యార్డు మూసి ఉండటంతో దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. పంట నిల్వ చేసుకునేందుకు శీతల గిడ్డంగులు ఖాళీ లేక తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

mirchi crop
కుప్పలుగా పోసిన మిర్చి పంట

By

Published : May 6, 2021, 7:03 PM IST

Updated : May 6, 2021, 7:12 PM IST

పతనమైన మిర్చి ధరలు రైతులను ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. రూ.12వేల నుంచి రూ.13 వేల వరకు అమ్మకాలు జరిగిన తేజారకాలు ప్రస్తుతం రూ.10 వేలకు అమ్మాల్సిన పరిస్థితి నెలకొంది. రూ.11వేలు వరకు అమ్మిన నాటురకం ప్రస్తుతం రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు అమ్మకాలు సాగుతున్నాయి. కాయలు బాగుంటే మరో రూ.500 క్వింటాకు అదనంగా ధర వస్తోంది. ఆరుగాలం శ్రమించిన రైతన్న పంట అమ్మకానికి వచ్చే వరకు తీవ్ర నిరాశకు గురవుతున్నాడు. కల్లాల్లో ఉన్న మిర్చిని అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతున్నాడు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో గుంటూరు మిర్చి యార్డుకు సెలవులు ఇచ్చారు. దీంతో స్థానిక వ్యాపారులకు రైతులు పంటను తెగనమ్ముకోవాల్సి వస్తోంది. స్థోమత ఉన్న రైతు నిల్వ చేసుకుందామనుకున్నా పల్నాడులోని శీతలగోదాముల్లో ఖాళీలు లేవని చెబుతున్నారు. స్థానిక శీతల గిడ్డంగులు సరకుతో నిండిపోవడంతో రైతులకు దిక్కు తోచడం లేదు.

* తన కల్లంలో 140 క్వింటాళ్ల మిర్చి అమ్మకానికి సిద్ధంగా ఉంది. గుంటూరు యార్డులో అమ్మకాలు లేవు. జిల్లాలోని శీతల గోదాముల్లో ఖాళీలు లేవు. ప్రస్తుతం మంచి ధర లేదు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోందని గురజాలకు చెందిన రైతు మేడికొండ రాంబాబు వాపోతున్నారు.

* ఇదే ప్రాంతానికి చెందిన మరో రైతు కల్లంలో ఆరు క్వింటాళ్ల మిరపకాయలు ఉన్నాయి. క్వింటా రూ.6 వేలకు ప్రైవేటు వ్యాపారులు అడుగుతున్నారు. రూ.7 వేలకు తీసుకోమని వ్యాపారుల కాళ్లా వేళ్లా పడాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు.

రూ.3 వేల వరకు తగ్గుదల:

నెల వ్యవధిలో మిర్చి ధర క్వింటాకు 3వేల వరకు తగ్గుదల కన్పిస్తోంది. గుంటూరు యార్డుకు సెలవులు ఉండటం, దూర ప్రాంతాలకు వెళ్లి అమ్ముకోలేక రైతులు మరింత ఇబ్బందులు పడుతున్నారు. ధరలు పడిపోవడంతో మిర్చి పండించిన రైతు ఎకరాకు రూ.30వేల వరకు నష్టపోవాల్సి వస్తోంది. పల్నాడు ప్రాంతంలోని గురజాల రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 40 వేల హెక్టార్లలో మిరప పండింది.

నిల్వకు అవకాశం లేక:

పల్నాడు, జిల్లా వ్యాప్తంగా మిర్చి పండించిన రైతాంగం కొంతభాగం పంట విక్రయించి మిగిలినది శీతల గోదాముల్లో నిల్వ చేసుకుంటారు. ప్రస్తుతం శీతల గోదాముల్లో ఖాళీలు లేవని చెబుతుండడంతో రైతుకు పంట నిల్వకు అవకాశం లేకుండా పోయింది. సెప్టెంబరు మాసాల్లో మరోసారి మిరపకు రేటు వచ్చే అవకాశం ఉండటంతో అప్పుడు అమ్మకం చేస్తుంటారు. నిల్వ చేసిన మిర్చికి బ్యాంకు రుణం రూపంలో కొంత మొత్తం వస్తుండటంతో రైతులకు వెసులు బాటు ఉంటుంది. అయితే అనూహ్యంగా ఈ ఏడాది సరకుతో శీతల గోదాములు నిండిపోయాయి. ప్రస్తుతం పంట చేతిలో ఉన్న రైతులు నిల్వకు అవకాశం లేక ఇబ్బందులు పడుతున్నారు.

ఇదీ చదవండి:

మొక్కలపై మక్కువ... ఇల్లే వ్యవసాయ క్షేత్రం!

Last Updated : May 6, 2021, 7:12 PM IST

ABOUT THE AUTHOR

...view details