ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

No Government Support for Sports: క్రీడారంగానికి ప్రోత్సాహం లేదు.. ఇలా అయితే జాతీయ స్థాయి క్రీడాకారులు ఎలా తయారవుతారు సీఎం సారూ.. - No Government Support

No Government Support for Sports: రాష్ట్రంలో క్రీడారంగం అవస్థలతో కునారిల్లుతోంది. క్రీడాకారులు తగిన ప్రోత్సాహం లేక నిరుత్సాహానికి గురవుతున్నారు. కోచ్‌ల కొరత, క్రీడామైదానాల్లో వసతుల లేమితో వర్థమాన క్రీడాకారులు ఇబ్బందులకు గురవుతున్నారు. వీటికి తోడు శాప్‌ తీరు ఆటగాళ్లకు శాపంగా మారుతోంది. మైదానాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన ప్రభుత్వం.. రాజకీయ ప్రాభవం కోసం నామమాత్రంగా క్రీడాపోటీలు నిర్వహించి చేతులు దులుపుకుంటోంది.

No Government Support for Sports
No Government Support for Sports

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 29, 2023, 7:20 AM IST

No Government Support for Sports: క్రీడారంగానికి ప్రోత్సాహం లేదు.. ఇలా అయితే జాతీయ స్థాయి క్రీడాకారులు ఎలా తయారవుతారు సీఎం సారూ..

No Government Support for Sports: రాష్ట్రంలో జాతీయ స్థాయి క్రీడాకారులు తయారవ్వాలి. నియోజకవర్గానికి ఒక ఇండోర్‌ స్టేడియం, ప్రతి మండలంలోనూ మైదానాలు ఏర్పాటు చేయాలి. ఏపీ నుంచి కూడా ఐపీఎల్‌ టీం ఉండేలా చూడాలి. ఇవి క్రీడలశాఖపై నిర్వహించే సమీక్ష సమావేశాల్లో సీఎం జగన్‌ తరుచూ చెప్పే మాటలు. సీఎం మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు గడప దాటడం లేదు.

రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థకు తగిన నిధులు కేటాయించడం లేదు. క్రీడా మైదానాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలేదు. రెగ్యులర్‌ కోచ్‌లు లేరు. అకాడమీలు కూడా లేకుండా జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయడం అసాధ్యం. పేద క్రీడాకారుల నుంచి సైతం ‘పే అండ్‌ ప్లే’ విధానంలో ఫీజులు వసూలు చేయడం, శాప్‌ ఆధ్వర్యంలోని క్రీడా మైదానాలను ప్రైవేట్‌ సంస్థల చేతుల్లో పెడితే ప్రతిభ కలిగిన క్రీడాకారులు గాలిలో పుట్టుకొస్తారా అని క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

AP sports field in neglect కొత్త స్టేడియం లేదు.. ఉన్నవాటికి రిపేర్లు లేవు! ఐపీఎల్ టీం మాత్రం తయారైపోవాలి..!

రాజకీయ ప్రాభవం కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి అప్పుడప్పుడు నిర్వహించే సీఎం కప్‌ క్రీడా పోటీలు, ఈ ఏడాది అక్టోబరులో నిర్వహించబోయే ‘ఆడుదాం ఆంధ్ర ’ పోటీలతో.. క్రీడాకారులకు కలిగే ప్రయోజనం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఆ నిధులతో నాలుగు స్టేడియంలు నిర్మించినా, ఉన్న మైదానాల్లో మౌలిక సదుపాయాల కల్పించినా ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెబుతున్నారు. గత నాలుగేళ్లలో జాతీయ స్థాయిలో రాష్ట్రంలో ఒక్క టోర్నీని కూడా నిర్వహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

భారత క్రికెటర్‌ అనిల్‌కుంబ్లే సంస్థ టెన్‌విక్‌ ఆధ్వర్యంలో గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన అకాడమీలను ప్రస్తుత సర్కారు అటకెక్కించింది. క్రీడలను ప్రోత్సహించే పేరుతో ఏర్పాటు చేసిన జగనన్న స్పోర్ట్స్‌ క్లబ్‌లు మూన్నాళ్ల ముచ్చటగా మిగిలాయి. క్రీడాకారుల తయారీలో ఎంతో ముఖ్యమైన శాశ్వత కోచ్‌లు శాప్‌ ఆధ్వర్యంలో అరడజను మంది కూడా లేరు. పొరుగు సేవల కింద దాదాపు 100 మంది పని చేస్తున్నారు. వీరికి నెలకు ఇస్తున్న జీతం కేవలం 15 వేలు మాత్రమే.

No facilities in the grounds: 'ఆటల్లేవ్.. ఆడుకోవడాల్లేవ్.. అయినా ఐపీఎల్ కల'

‘పే అండ్‌ ప్లే ’ విధానాన్ని తీసుకొచ్చాక కోచ్‌ల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయాలని శాప్‌ అధికారులు వీరిపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ విషయంలో వెనుకబడిన వారికి తాఖీదులిచ్చి హడలెత్తిస్తున్నారు. క్రీడలకు చిన్న రాష్ట్రాలు సైతం కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నాయి. రాష్ట్రంలో ఇందుకు భిన్నమైన పరిస్థితి. ఉద్యోగుల జీతాలకు, ఇతర నిర్వహణ ఖర్చులకు మాత్రమే ప్రభుత్వం శాప్‌కు నిధులిస్తోంది. దీంతో శాప్‌ ఆధ్వర్యంలోని ఇండోర్‌ స్టేడియాలు, స్విమ్మింగ్‌ పూల్‌లు, క్రీడా మైదానాలు ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించడం, ఇంకొన్ని చోట్ల అద్దెకివ్వడం చేస్తున్నారు.

'పే అండ్‌ ప్లే' విధానం సైతం ఇదే కోవకు చెందిందే. మైదానాలకు శిక్షణ కోసం వచ్చే పేద, మధ్య తరగతి విద్యార్థులు ఫీజుల భారంతో క్రమంగా దూరమవుతున్నారు. ఇలా వచ్చే ఆదాయాన్ని సైతం శాప్‌ అధికారులు మైదానాల అభివృద్ధికి వెచ్చించడం లేదు. కోచ్‌లకు జీతాలు ఇచ్చి మిగతా నిధులను శాప్‌ అవసరాలకు ఖర్చు చేస్తున్నారు. దీంతో జిల్లాల్లో ఉన్న శాప్‌ ఇండోర్‌ స్టేడియాలు, కీడ్రా మైదానాల్లో మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉంది.

మచిలీపట్నంలో క్రీడా మైదాన నిర్మాణం పూర్తయ్యేనా?

No Facilities in Grounds: ఇతర రాష్ట్రాల్లోని అకాడమీల్లో సొంత ఖర్చులతో శిక్షణ పొంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్న క్రీడాకారులను సీఎం జగన్‌ సత్కరించి ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. అంతేకాని శాప్‌ ఆధ్వర్యంలో అకాడమీలు ఏర్పాటు చేసి రాష్ట్రంలోని పేద క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. జాతీయ స్థాయిలో ప్రతిభ ఉన్న క్రీడాకారుల ప్రోత్సాహం కోసం ప్రతిపాదించిన నగదు పురస్కారాలు సైతం ఇప్పటికీ పూర్తిగా ఇవ్వలేదు.

క్రీడలను ప్రోత్సహించేందుకు పొరుగున ఉన్న తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. తెలంగాణ వ్యాప్తంగా 17 వేలకుపైగా క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది. 23 క్రీడా పరికరాలతో కూడిన 18 వేల స్పోర్ట్స్‌ కిట్లను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. కానీ మన ప్రభుత్వం దగ్గర మాత్రం అలాంటి ఆలోచన ఉన్నట్లు లేదు. దీంతో క్రీడాకారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

Indira Gandhi Stadium: ఇందిరాగాంధీ స్టేడియంలో మహాయాగం.. ప్రభుత్వ తీరుపై క్రీడాకారుల అసహనం

ABOUT THE AUTHOR

...view details