No Funds to Urdu Computer Training Centers : ఉర్దూ మాధ్యమ విద్యార్థులు, అభ్యర్థులు, పాఠకుల కోసం గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు, గ్రంథాలయాలు అడవి కాచిన వెన్నెలలాగా మిగిలిపోయాయి. కరోనా లాంటి మహమ్మారి పరిస్థితులు ఏర్పడి అంతా సద్దుమణిగిన తర్వాత కూడా ఇవి పని చేయటం లేదు. గత 14 నెలలుగా నిధుల కొరతతో శిక్షణ కేంద్రాలు ముందుకు సాగటం లేదు.
గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని ఉర్దూ కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు, గ్రంథాలయాల నిర్వహణకు గత 14 నెలలుగా నిధులు అందటం లేదు. ఉర్దూ భాషలో ప్రావీణ్యం సంపాదించుకుని ప్రపంచ స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందటానికి వీలుగా.. ఈ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేయగా.. ఇప్పటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని రోజులు వాటిని అలాగే కొనసాగించింది. గత ప్రభుత్వం ఏర్పాటు చేసినవే కాకుండా.. మరికొన్ని కొత్త కేంద్రాలను సైతం ఏర్పాటు చేసింది. కరోనా రాకతో వీటిని తాత్కలికంగా మూసివేశారు. తర్వాత పునః ప్రారంభించినా.. నిధుల లేమితో ఇవి సరిగా నడవటం లేదు.
కొవిడ్ ఉద్ధృతి తగ్గిన తర్వాత ఈ కేంద్రాలకు నిధులు అందటం లేదు. దీంతో వీటి నిర్వహణ సాఫీగా సాగటం లేదు. ఉర్దూ అకాడమీ పరిధిలో నరసరావుపేట, పిడుగురాళ్ల, తెనాలి, పర్చూరు, చీరాలలో కంప్యూటర్ శిక్షణ కేంద్రాలతోపాటుగా గ్రంథాలయాలున్నాయి. మంగళగిరి, చిలకలూరిపేటలో కేవలం ఉర్దూ కంప్యూటర్ శిక్షణ కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేశారు. సత్తెనపల్లి, మేడికొండూరులో గ్రంథాలయ సేవలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 11 కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ఈ కేంద్రాలలో ఇన్స్ట్రక్టర్, లైబ్రేరియన్, అటెండర్లు విధులు నిర్వహిస్తున్నారు.