No Funds to revenue generate centres: 'పట్టణాల తరహాలో గ్రామాల్లోనూ పారిశుద్ధ్య సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోండి.. వ్యర్థాల సేకరణకు ప్రత్యేక నంబరును డిస్‌ప్లే చేసి.. దానికి కాల్ రాగానే వాహనంలో చెత్తను ట్రీట్‌మెంట్ ప్లాంట్లకు తరలించండి. అపరిశుభ్రత, దోమల వల్ల ఊళ్లలో రోగాలు రాకుండా మెరుగైన పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టండి అని' 2021 జులై 13న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ సమీక్షలో అధికారులకు సీఎం జగన్ చెప్పిన మాటలివి. కానీ, క్షేత్రస్థాయిలో చూస్తే వ్యర్థాలతో నాడు సంపద సృష్టించిన కేంద్రాల ఉనికి నేడు ప్రశార్థకంగా మారింది. అందులో పనిచేస్తున్న క్లాప్ మిత్రలకు 8 నెలలుగా జీతాలు అందని దుర్భర పరిస్థితి నెలకొంది.
గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య శాశ్వత పరిష్కారానికి.. గత ప్రభుత్వం పంచాయతీకి ఓ సంపద తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. హరిత రాయబారుల ద్వారా ఇళ్లు, వీధుల్లో వ్యర్థాలు సేకరించి, వాటి నుంచి ఎరువుల తయారీ.. విక్రయాల ద్వారా పంచాయతీలకు ఆదాయం సమకూర్చాలన్నది ఈ కార్యక్రమ ఉద్దేశం. తూర్పు గోదావరి జిల్లాలోని పి. గన్నవరం మండలం కుందలపల్లిలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేశారు.
13 వేలకు పైగా సంపద తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసి దాదాపు 40 వేల మంది హరిత రాయబారులను నియమించారు. సంపద తయారీ కేంద్రంలో చెత్త నుంచి తయారైన ఎరువులను గ్రామాల్లో రైతులకు మార్కెట్లో లభించే ధర కన్నా తక్కువ ధరకు విక్రయించేవారు. ఎంతో చక్కగా అమలైన ఈ కార్యక్రమం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తారుమారైంది. సంపద తయారీ కేంద్రాలకు నిధుల కొరత, కార్మికులకు సరిగా జీతాలు అందించలేని కారణంగా చాలా కేంద్రాల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. వాటి ఉనికి నేడు ప్రశ్నార్థకంగా మారింది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపు 991 చెత్త నుంచి సంపద ఉత్పత్తి కేంద్రాల షెడ్లు ఏర్పాటు చేయగా.. వీటిలో ఇప్పుడు 150 మాత్రమే పనిచేస్తున్నాయి. చాలా గ్రామాల్లో వాటి నిర్వహణ సరిగ్గా లేక ముళ్లపొదలతో నిండిపోయాయి. కొన్ని చోట్ల షెడ్లు శిధిలావస్థకు చేరాయి. మందు బాబులకు అడ్డాగా మారాయి. అసాంఘిక కార్యక్రమాలూ జరుగుతున్నాయి. చెత్త సేకరణకు కేటాయించిన రిక్షాలు, ఆటోలు అనేకచోట్ల మరమ్మతులకు గురయ్యాయి.