ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Sub Registration Offices: సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో నరకం.. డబ్బులు తీసుకుంటారు.. కానీ వసతులు కల్పించరు.. - Sub Registration Offices

No Facilities in Sub Registration Offices: ఒక్కో దస్తావేజు రిజిస్ట్రేషన్‌కు వినియోగదారుడు ప్రభుత్వానికి చెల్లిస్తున్న రుసుము 500 రూపాయలు. ఇలా సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా వసూలు అవుతున్న మొత్తం సుమారు వంద కోట్ల రూపాయలు. ఈ సొమ్ముతో వినియోగదారులకు అవసరమైన అన్ని సౌకర్యాలూ కల్పించాలి. కానీ ఏ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం చూసినా.. కూర్చునేందుకు కనీసం కుర్చీల్లేవ్‌. మూత్రశాలలూ లేనేలేవు. గొంతు తడిపే దిక్కు లేదు. ఎండైనా.. వానైనా.. బయట నిలబడాల్సిందే.వాహనాల పార్కింగ్‌ సదుపాయం లేదు. కనీసం కార్యాలయాల అద్దెనూ చెల్లించలేని దుస్థితి. వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేసి.. జగన్‌ ప్రభుత్వం వారిని ఎండావానలకు వదిలేసింది.

No Facilities in Sub Registration Offices
No Facilities in Sub Registration Offices

By

Published : Jul 22, 2023, 10:34 AM IST

Updated : Jul 23, 2023, 3:14 PM IST

No Facilities in Sub Registration Offices: ఆస్తుల క్రయ, విక్రయాల దారా ప్రజల నుంచి కోట్లాది రూపాయలను వసూలు చేస్తోన్న జగన్‌ ప్రభుత్వం.. రాష్ట్రంలోని సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో కనీస సదుపాయాలు కల్పించకుండా గాలికొదిలేసింది. దస్తావేజుల రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయాన్ని పెంచాలని సబ్‌-రిజిస్ట్రార్లపై నిత్యం ఒత్తిడి పెంచే రాష్ట్ర రిజిస్ట్రేషన్‌, స్టాంపుల శాఖ వసతుల కల్పన తన బాధ్యత కాదన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఆ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు సైతం ఏనాడూ వీటిపై దృష్టి పెట్టలేదు.

దస్తావేజుల రిజిస్ట్రేషన్లు చేయించుకునేవారి నుంచి వినియోగ రుసుముల కింద ఏటా దాదాపు వందకోట్ల రూపాయల వరకు పోగవుతున్నాయి. ఈ మొత్తంతో సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో కనీస సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. దైనందిన కార్యకలాపాల నిర్వహణకు వెచ్చించాలి. కానీ.. జగన్‌ సర్కారు ఆ దిశగా ఆలోచన చేయలేదు. కార్యాలయాల భవనాల అద్దెలనూ సక్రమంగా చెల్లించడం లేదు. విద్యుత్తు ఛార్జీల చెల్లింపు విషయంలోనూ ఇదే పరిస్థితి. చాలాచోట్ల కార్యాలయాలు ఇరుగ్గా ఉంటున్నాయి.

అత్యధిక సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో కాలకృత్యాలు తీర్చుకునేందుకు మరుగుదొడ్లు లేవు. ఉన్నచోట వినియోగానికి అనువుగా లేవు. మహిళలైతే నరకం అనుభవిస్తున్నారు. సమీపంలో ఏమైనా సులభ్‌ కాంప్లెక్సులు, హోటళ్లు ఉంటే సరి. లేదంటే బయటకు చెప్పుకోలేని బాధతో విలవిల్లాడిపోతున్నారు.

1858లో అనకాపల్లి జిల్లా ఎలమంచిలి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని బ్రిటిష్‌వారు ఏర్పాటు చేసినా.. అది బాగా ఇరుగ్గా ఉంది. రోజూ వందల్లో వస్తున్న వినియోగదారులకు కనీస సదుపాయాల్లేవు. పార్వతీపురం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం పైకప్పు బాగాలేక వర్షం పడుతోంది. పరదాలు కప్పి వాన నుంచి రక్షణ కల్పిస్తున్నారు.

విశాఖలోని గోపాలపట్నం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో మరుగుదొడ్లు, మంచినీరు లేవు. కుర్చీలు చాలడం లేదు. మధురవాడ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సరైన వసతి లేదు. మంచినీరు సహా, మరుగుదొడ్లూ లేవు. వినియోగదారులు కూర్చునే రేకుల షెడ్డు శిథిలమైంది. ఆనందపురం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని వేములవలసలోని ఓ నాయకుడి భవనంలోకి మార్చారు. మరుగుదొడ్డి వ్యవస్థ లేదు. శ్రీకాకుళం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం, జిల్లా కార్యాలయం నగరానికి దూరంగా ఉన్నాయి.

తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం లేదు. కడప రూరల్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఇరుకైన గదుల్లో ఒకేసారి నలుగురు వ్యక్తులు కూడా నిలబడలేని పరిస్థితి. మంచినీరు లేదు. వాహనాల పార్కింగ్‌ పరిస్థితి దారుణం. జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని నగరానికి సుదూరంగా వైసీపీ నాయకులకు చెందిన భవనంలోకి తరలించడం అర్బన్‌వాసులకు తీవ్ర సమస్యగా మారింది. జిల్లాలోని మిగిలిన కార్యాలయాల్లోనూ అన్నీ సమస్యలే.

విజయవాడలోని పటమట సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయం పురాతన భవనంలో ఇరుకు గదుల మధ్య అరకొర సౌకర్యాలతో నడుస్తోంది. ప్రతి సంవత్సరం 200 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది కానీ కూర్చోడానికి సరిపడా కుర్చీల్లేవు. రోడ్డుపై నిల్చోవాల్సిందే. మహిళల అవస్థలు వర్ణనాతీతం. నరసరావుపేట ప్రకాష్‌నగర్‌లో ఉన్న కార్యాలయం వద్ద ప్రజలు నిలబడి గంటల తరబడి నిరీక్షించాల్సిందే.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రిజిస్ట్రార్‌, కాకినాడ జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద వినియోగదారులకు వసతులు కరవు . మహిళల మరుగుదొడ్డి తలుపునకు గడియ లేదు. మంచినీటి సౌకర్యం లేదు. బాపట్ల, గుంటూరు, ఏలూరు, అనకాపల్లి, చిత్తూరు, విజయనగరం జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో నరకం
Last Updated : Jul 23, 2023, 3:14 PM IST

ABOUT THE AUTHOR

...view details