No Action Against on Votes Deletion in AP: రాష్ట్రంలో ఓట్ల తొలగింపును ఈసీ ఎందుకు ఉపేక్షిస్తోంది.. No Action Against on Votes Deletion in AP: రాష్ట్రంలో ప్రతిపక్షాలకు చెందిన వారి ఓట్ల తొలగింపు అడ్డుగోలుగా సాగుతున్నా.. బాధ్యులపై చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. అనంతపురం జిల్లా ఉరవకొండలో అక్రమాలపై ఆ నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్.. దిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులకు పదే పదే ఫిర్యాదులు చేసి, దాదాపు ఏడాది పాటు పోరాడితే ఇప్పటికి బాధ్యులపై చర్యలు తీసుకున్నారు.
ఆయనలా ఎంత మంది దిల్లీ వరకూ వెళ్లి పోరాడగలరు. దిల్లీ వెళ్లి ఫిర్యాదు చేస్తే కానీ పట్టించుకోరా. దిల్లీ నుంచి వచ్చి రాష్ట్రంలో విచారణ జరపాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది. జిల్లా ఎన్నికల అధికారులకు ఎందుకు పట్టించుకోరు. ముందే గుర్తించి బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు. అసలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఏం చేస్తున్నట్లు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఊరు ఉరవకొండలాగానే తయారయ్యింది. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో, ఏ పల్లెలో చూసినా ఓటర్ల జాబితాలో ఉరవకొండ నియోజకర్గంలో జరిగిన తరహాలో అక్రమాలు, అవకతవకలు కోకొల్లలుగా వెలుగుచూస్తూనే ఉన్నాయి. అనేక నియోజకవర్గాల్లో కొన్ని కుటుంబాలకు ఓటే లేకుండా చేశారు. మరికొన్ని కుటుంబాల్లో ఒకరికి ఓటు ఉంచి మిగతా వారివి తీసేశారు.
Anantapur Zilla Parishad Chief Electoral Officer Suspended: ఉరవకొండలో ఓట్ల తొలగింపు.. అనంతపురం జడ్పీ ప్రధాన ఎన్నికల అధికారి సస్పెన్షన్
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసిన వారి పేర్లను కూడా.. ప్రస్తుతం జాబితాలో తొలగించారు. ఒకే కుటుంబంలోని వారు ఓట్లు ఒక ఓటు ఒక పోలింగ్ కేంద్రం పరిధిలో ఉంచి.. మరొకరిది వేరే పోలిగ్ బూత్ పరిధిలో చేర్చేశారు. డోర్ నంబర్ సున్నాతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితాలో చేర్చారు. ఒకే ఇంట్లో, ఒకే డోర్ నంబర్ చిరునామాతో వందల ఓట్లు నమోదు చేశారు. ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరుల ఓట్లు ఇష్టానుసారంగా తొలగించేశారు.
అధికార పార్టీకి అనుకూలంగా భారీగా నకిలీ ఓట్లు చేర్చారు. ఇలా ఒకటో, రెండో కాదు.. ఎన్నెన్నో అక్రమాలు, అవకతవకలు. వీటిపై ప్రతిపక్ష పార్టీలు ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి పదే పదే ఫిర్యాదులు చేస్తున్నాయి. కళ్ల ముందే అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నా ఎన్నికల సంఘం ఎందుకు కళ్లు మూసుకుంటోంది. అడ్డగోలుగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు. వారిని ఎన్నికల సంఘం ఎందుకు ఉపేక్షిస్తోంది.
Vote Deletion: "నిబంధనలకు విరుద్ధంగా ఓట్లు తొలగించారు.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం"
అక్రమాలు చోటుచేసుకున్న నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు బాధ్యులైన ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, సహాయ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారిలపై ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు. జిల్లా ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తున్న.. జిల్లా కలెక్టర్లను ఈసీ ఎందుకు ప్రశ్నించట్లేదు. జిల్లా కలెక్టర్లు వారి పరిధిలోని అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు. వారంతా అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చర్యలకు వెనకంజ వేస్తున్నారా.
దిల్లీ వెళ్లి ఫిర్యాదు చేస్తే తప్ప బాధ్యులపై చర్యలు తీసుకోరా. కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలో ఒకే ఇంట్లో నివసిస్తున్న కుటుంబసభ్యుల ఓట్లను వేర్వేరు పోలింగ్ కేంద్రాల పరిధిలో పెట్టేశారు. కొంతమంది వ్యక్తులకు సంబంధించి ఒకే పేరును జాబితాలో రెండు, మూడు సార్లు చేర్చారు. ఈ వ్యవహారంలో ప్రతిపక్ష పార్టీల వారు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా బాధ్యులపై చర్యలే లేవు.
Vote Deletion: ఇష్టారాజ్యంగా ఓటరు జాబితాలో మార్పులు..
చర్యలు లేకపోవటంతో చిలకలపూడికి చెందిన ఎల్. దిలీప్‌కుమార్ అనే వ్యక్తి చివరికి హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఇటీవల విశాఖపట్నంలో దిల్లీ నుంచి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు నిర్వహించిన సమావేశంలోనూ ఈ అంశంపై చర్చ జరిగింది.
మచిలీపట్నం నియోజకవర్గానికి ఈఆర్‌వోగా వ్యవహరిస్తున్న ఆర్డీవోపై తగిన చర్యలు తీసుకుని, ఆ నివేదిక పంపించాలని జులై 13న కేంద్ర ఎన్నికల సంఘం కృష్ణా జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకూ ఆర్డీవోపై ఎలాంటి చర్యలూ లేవు. తమ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆర్డీవోపై చర్యలు తీసుకోని అధికారులను ఎన్నికల సంఘం ఎందుకు ఉపేక్షిస్తోంది.
PRATHIDWANI గుట్టుగా విపక్షాల సానుభూతిపరుల ఓట్ల తొలగింపు
విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం పరిధిలో 40 వేలకు పైగా ఓట్లు తీసేశారని వీటిల్లో అత్యధిక శాతం ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులవేనని ఆధారాలతో సహా అక్కడి టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కేవలం 22 మంది ఓట్లే తొలగించారంటూ తేల్చేసి ముగ్గురు బీఎల్‌వోలపై చర్యలు తీసుకుని సరిపెట్టేశారు.
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఒకే ఇంట్లో 181 ఓట్లు వెలుగుచూశాయి. ఒకే డోర్ నంబర్‌తో ఏకంగా 2 వేల 498 ఓట్లు బయటపడ్డాయి. వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ప్రభుత్వ సలహాదారు ఆలూరి సాంబశివారెడ్డిలకు చెందిన ఇంజినీరింగ్ కళాశాలలో 21 ఓట్లు నమోదయ్యాయి. ఈ ఘటనల్లో బాధ్యులపై చర్యల్లేవు.
Voter Deletion in AP: అనర్హులంటూ.. గిట్టని ఓట్లను తీసి పారేస్తున్నారు
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో 17 వేలకు పైగానే నకిలీ ఓట్లు ఉన్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వాలంటీర్లు, వైకాపా సానుభూతిపరుల పేరున రెండు, మూడేసి ఓట్లు ఉన్నట్లు ఫిర్యాదులు చేశారు. అయినా సరే బాధ్యులైన అధికారులపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
విజయవాడ సెంట్రల్, గుంటూరు పశ్చిమ తదితర నియోజకవర్గాల్లో ఒకే డోర్ నంబర్‌తో వందల మందికి ఓట్లు కల్పించారు. ఇంటి నంబరు లేకుండానే కొందర్ని చేర్పించారు. ప్రతిపక్ష పార్టీల వారి ఓట్లు భారీగా తొలగించారు. వీటిపై అనేక ఫిర్యాదులందినా సరే బాధ్యులపై చర్యల్లేవు. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయి.
‘‘ఓటర్ల జాబితా సవరణ సహా ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఏ విధుల్లోనూ ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించొద్దు. అది మీ మెడకు చుట్టుకునేలా చేసుకోవొద్దు’’ అంటూ ఇటీవల విశాఖపట్నంలో జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో దిల్లీ నుంచి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు హెచ్చరించారు. ఉరవకొండ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో 2020, 2021 సంవత్సరాల్లో పాల్పడ్డ అవకతవకలకు ఈఆర్‌వోలపై ఇప్పుడు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల విధుల్లో ఉంటున్న అధికారులు ఇప్పటికైనా అప్రమత్తం కావాలని.. తప్పు చేస్తే అది ఎప్పటికైనా వారిని వెంటాడక మానదని విపక్ష నాయకులు అంటున్నారు.
TDP on Fake Votes: టీడీపీ మద్దతుదారుల ఓట్లు పెద్ద సంఖ్యలో తొలగించారు: బొండా ఉమ