రాజకీయ పార్టీల మధ్య వివాదం ముదరటంతో.... కొన్ని నెలల క్రితం గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం పొనుగుపాడులో జరిగిన గోడ నిర్మాణం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నలుగురు అధికారులతో కూడిన జాతీయ మానవహక్కుల కమిషన్ బృందం... ఆ గ్రామంలో పర్యటించింది. వివాదానికి దారి తీసిన పరిస్థితులను ఆరా తీసింది.
ప్రభుత్వ భూమిలో గోడ నిర్మాణం వల్ల రాకపోకలు స్తంభించాయని... రాష్ట్రంలో అధికార మార్పు వల్లే ఈ పరిణామం వచ్చిందని ఓ వర్గం వారు అధికారులకు వివరించారు. 1902లో చర్చి కోసం ఈ స్థలాన్ని కేటాయించారని... దాన్ని పరిరక్షించుకునేందుకే గోడను నిర్మించినట్టు మరో వర్గం తెలిపింది. ఇరువర్గాల ప్రతినిధులతో పాటు ఇతర సామాజిక వర్గాల ప్రతినిధులను రెండున్నర గంటలపాటు అధికారులు విచారించారు. అందరి వాంగ్మూలాలను నమోదు చేసుకుని... త్వరలోనే నివేదిక తయారు చేయనున్నారు. గ్రామంలో నెలకొన్న సున్నిత పరిస్థితుల దృష్ట్యా పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన బహిరంగ విచారణకు మీడియా ప్రతినిధులకు ఆంక్షలు విధించారు.