తొలి దశలో జరిగిన స్థానిక ఎన్నికల పోరులో ప్రజలు ఇచ్చిన తీర్పు ముఖ్యమంత్రి జగన్ పరిపాలనకు ఇచ్చిన మద్దతని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణరావు అన్నారు. గుంటూరు జిల్లా నిజాంపట్నంలోని ఆయన నివాసంలో.. నగరం, నిజాంపట్నం మండలాల్లో సర్పంచ్ పోటీల్లో గెలుపొందిన వైకాపా బలపరిచిన అభ్యర్థులు కలిసినట్లు చెప్పారు. తొలి విడత ఎన్నికల్లో సుమారు 95 శాతం వైకాపా బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులనే ప్రజలు గెలిపించడం ఎంతో ఆనందంగా ఉందని మోపిదేవి తెలిపారు.
మిగిలిన విడతల్లో జరగనున్న ఎన్నికల్లోనూ ఇలాంటి తీర్పే వెలువడుతుందని జోస్యం చెప్పారు. ప్రతిపక్ష నేతలు ఎస్ఈసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నా.. ప్రజలు వైకాపా ప్రభుత్వానికి అండగా ఉన్నారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుందని కొనియాడారు.