New Collectorates Construction in AP: గతేడాది ఏప్రిల్ 4న రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. హడావుడిగా వీటిని తీసుకురావడంతో.. కలెక్టరేట్లను ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, ఇంజినీరింగ్ కళాశాలలు, అతిథిగృహాలు, ప్రైవేటు భవనాల్లో ఏర్పాటు చేసి.., చాలీచాలని వసతులతో నెట్టుకొస్తున్నారు. కొత్త జిల్లాలు ఏర్పడి ఏడాదిన్నర దాటినా.., ఇంతవరకు నిర్మాణాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆగమేఘాలపై కొత్త కలెక్టరేట్ల నిర్మాణానికి డీపీఆర్‌ల తయారీ చేయాలంటూ నానా హంగామా చేస్తుంది. తొలివిడతలో మన్యం పార్వతీపురం, పాడేరు, భీమవరం, నరసరావుపేట, రాయచోటి, పుట్టపర్తి, నంద్యాల కలెక్టరేట్ల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించింది.
YCP Govt focus on New Collectorates Construction Before Election: మొదటగా ఏడు జిల్లాల్లో కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మాణానికి స్థలాలు ఎంపిక చేసినప్పటికీ.. వీటిలో రెండు చోట్ల మాత్రమే భూములు అనువుగా ఉన్నట్లు గుర్తించారు. పార్వతీపురంలోని అడ్డాపుశిల గ్రామంలో 60 ఎకరాలు కేటాయించగా.., అదంతా కొండలా ఉండటంతో నిర్మాణం అసాధ్యమని తేల్చేశారు. పాడేరులోని తలారిసింగి వద్ద 10 ఎకరాలు కేటాయించగా, మరో 5 ఎకరాలు కావాలని కోరుతున్నారు. నరసరావుపేటలోని లింగమంగుంట్లలో 27.49 ఎకరాలు ఎంపికచేసినా, అదనంగా మరికొంత భూమి అడుగుతున్నారు.
AP New Collectorates Construction: రాయచోటిలోని మాసాపేటలో కేటాయించిన 40 ఎకరాల్లోనూ రాళ్లగుట్టలున్నాయి. వాటిని తొలగించి చదును చేయడంలో ఆలస్యం కానుంది. పుట్టపర్తిలోని కప్పలబండలో 15.72 ఎకరాలు కేటాయించినా.., అదంతా ఒకే చోట కాకుండా వంపులు తిరిగి ముక్కలుముక్కలుగా ఉన్నాయి. భీమవరంలో గునుపూడి వద్ద మార్కెట్‌యార్డుకు చెందిన 20 ఎకరాలు, నంద్యాలలో నూనేపల్లిలో కేటాయించిన 10 ఎకరాలు మాత్రమే నిర్మాణాలకు అనువుగా ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లోని అనకాపల్లి, రాజమహేంద్రవరం, అమలాపురంలో స్థలాల ఎంపిక పూర్తి కాలేదు.