బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో వాస్తవాల అన్వేషణలో భాగంగా గుంటూరులో జాతీయ ఎస్సీ కమిషన్ బృందం చేపట్టిన పర్యటన ముగిసింది. హత్య జరిగిన ప్రాంతాన్ని బృందం పరిశీలించింది. అలాగే రమ్య కుటుంబసభ్యులతో మాట్లాడారు. అనంతరం అతిథి గృహం వద్ద పార్టీలు, ప్రజాసంఘాల నుంచి వినతులను స్వీకరించారు.
రమ్య హత్య కేసును తీవ్రంగా పరిగణిస్తున్నాం. కుటుంబసభ్యులు, వివిధ వర్గాల నుంచి సమాచారం తీసుకున్నాము. రమ్య హత్య కేసులో నిందితులకు శిక్ష పడేలా చూసి.. ఆమె కుటుంబానికి న్యాయం చేస్తాం. :-ఎస్సీ కమిషన్ ఉపాధ్యక్షుడు అరుణ్ హల్దేర్
దాడుల గురించి వివరించాం: తెదేపా
యువతి రమ్య ఘటనపై విచారణ జరపడానికి వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్‌ను తెదేపా బృందం కలిసింది. రమ్య హత్య విషయమై సీనియర్ నేతలు నక్కా ఆనంద్‌బాబు, వర్ల రామయ్య, శ్రావణ్‌కుమార్.. కమిషన్ అధికారులను విజయవాడలో కలిశారు. ఈ ఘటనతో పాటు రాష్ట్రంలో దళితులపై జరిగిన దాడులను వారికి వివరించారు. ఈ ఘటనలపై సవివరంగా వింటామన్న కమిషన్.. సాయంత్రం 5.30 గంటలకు తెదేపా నేతలకు అపాయింట్‌మెంట్ ఇచ్చింది.
'జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్, సభ్యులను ఒక్క నిమిషమే కలిశాం. రాష్ట్రంలో దళితులపై జరిగిన దాడుల వివరాల బుక్‌లెట్ చూపించాం. సాయంత్రం 5.30 గంటలకు రమ్మని మాకు చెప్పారు. సాయంత్రం సీఎం, గవర్నర్ వస్తారని.. అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. ఎస్సీ కమిషన్‌ను కలవకుండా అధికారులు పక్కదారి పట్టించారు' - తెదేపా నేతల బృందం
వినతుల స్వీకరణ..
ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో జాతీయ ఎస్సీ కమిషన్ బృందాన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు కలిశారు. బృంద సభ్యులకు పలు అంశాలపై వినతి పత్రాలు అందజేశారు. కమిషన్ సభ్యులను.. రాజధాని రైతులు కలిశారు. రాజధాని మార్పుతో తమకు అన్యాయం జరుగుతోందని ఫిర్యాదు చేశారు. ఎస్సీ రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని తెలిపారు.
ఇదీ చదవండీ..Ramya Murder Case: రమ్య ఇంటికి జాతీయ ఎస్సీ కమిషన్ బృందం