ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరపడం... పర్యావరణ నిబంధనలకు పాతరేడం... కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం... ఇదీ గుంటూరు శివార్లలోని పలకలూరు, పేరిచర్ల ప్రాంతాల్లోని కంకర క్వారీల నిర్వహణ తీరు. క్వారీల్లో పేలుడు పదార్థాల వినియోగం, పలు వ్యవహారాలపై స్థానికులు ఇచ్చిన ఫిర్యాదులపై జాతీయ హరిత ట్రైబ్యునల్ స్పందించింది. వాస్తవాలపై కాలుష్య నియంత్రణ మండలిని నివేదిక కోరింది. పీసీబీ అధికారులు చెన్నై ఐఐటీ నిపుణులతో అధ్యయనం చేయించారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన ఐఐటీ నిపుణులు... ఇక్కడి దుమ్ము, ధూళి, పర్యావరణ పరిస్థితులు, పేలుళ్ల ప్రభావం, ప్రజల ఇబ్బందులను శాస్త్రీయంగా పరిశీలించారు.
ఇక్కడి వాతావరణంలో పరిమితికి మించి ధూళి కణాలు ఉన్నట్లు తేల్చారు. నిబంధనల మేరకు క్యూబిక్ మీటర్ గాలిలో 600 మైక్రోగ్రాములకు మించి ధూళికణాలు ఉండకూడదు. ఇక్కడ 860 నుంచి 2వేల మైక్రోగ్రాముల పైగానే ఉన్నట్లు తేలింది. రోజువారీ తవ్వకాలు, అవి నిర్దేశించిన పరిమితిలోనే ఉన్నాయా..? వంటి అంశాలపైనా నిపుణులు అధ్యయనం చేశారు. ఎన్జీటీకి నివేదిక అందించారు. ఈ నివేదిక మేరకు చర్యలు తీసుకోవాలని జాతీయ హరిత ట్రైబ్యునల్... కాలుష్య నియంత్రణ మండలి అధికారుల్ని ఆదేశించింది.