పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలంటూ.. గుంటూరు జిల్లా నరసరావుపేట తెదేపా నేతలు పాదయాత్ర చేపట్టారు. అమరావతిని ప్రజారాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. 'చలో కోటప్పకొండ' కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ తెదేపా ఇంఛార్జ్ చదలవాడ అరవింద బాబు ఆధ్వర్యంలో.. పార్టీ కార్యాలయం నుంచి కోటప్పకొండ వరకూ యాత్ర సాగింది. అమరావతిని రాజధానిగా కొనసాగించడం కోసం రైతులు, అఖిలపక్షం నేతలు 320 రోజులుగా ఉద్యమం చేస్తుంటే.. వైకాపా ప్రభుత్వంలో స్పందన లేదన్నారు. తెదేపా హయాంలో చంద్రబాబు నాయుడు రైతుల సంక్షేమం కోసం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేపడితే.. దాన్ని పూర్తి చేయడంలో జగన్ సర్కారు విఫలమైందని విమర్శించారు. అమరావతి, పోలవరం అభివృద్ధికి సీఎం జగన్ అవినీతి ఆస్తులను ఉపయోగించాలన్నారు. 18 నెలల పాలనలో పూర్తి వైఫల్యం కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.
'18 నెలల పాలనలో అనేక మాఫియాలు పెరిగాయి' - narasaraopeta tdp leaders chalo kotappakonda
రాజధాని, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాల్లో వైకాపా విఫలమైందని.. గుంటూరు జిల్లా నరసరావుపేట తెదేపా ఇంఛార్జ్ చదలవాడ అరవింద బాబు విమర్శించారు. జగన్ 18 నెలల పాలనలో.. అనేక రకాల మాఫియాలు పెరిగిపోయాయని ఎద్దేవా చేశారు. అవినీతి, రాజకీయ ధోరణులతో ప్రజలను అణచివేయాలని చూస్తున్నారన్నారు.
30 లక్షల మంది కార్మికులకు ఉపయోగపడే విధంగా అన్నా క్యాంటీన్లను తెదేపా ఏర్పాటు చేస్తే.. వైకాపా అధికారంలోకి వచ్చి వాటిని తొలగించిందని అరవింద బాబు మండిపడ్డారు. ఇసుక కొరతను సృష్టించి.. నిర్మాణ కార్మికులను రోడ్డున పడేశారని ఆరోపించారు. జగనన్న వస్తాడు ఏదో చేస్తాడు అనుకున్న ప్రజలకు.. డీజిల్, పెట్రోల్, విద్యుత్తు ధరలు పెంచి నడ్డి విరిచారని విమర్శించారు. వైకాపా అవినీతి ధోరణి, రాజకీయ అణచివేతలతో ప్రజలలు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. మద్యం, ఇసుక, భూదందా, రేషన్ మాఫియాలు పెరిగిపోయాయని దుయ్యబట్టారు. పరిపాలనా విధానం ముఖ్యమంత్రికి తెలియడం లేదన్నారు. కరోనా సమయంలో ప్రజలను అన్నివిధాలా తెదేపా ఆదుకుందని గుర్తు చేశారు. కోటప్పకొండ త్రికోటేశ్వరుని దయతో రాబోయే కాలంలో వైకాపా పతనమవుతుందని జోస్యం చెప్పారు.
ఇదీ చదవండి:'పేదరికమనే జబ్బుకు ప్రభుత్వం చికిత్స చేస్తోంది'