గుంటూరు జిల్లా నరసారావుపేటలో ఉన్న నరసారావుపేట ఇంజినీరింగ్ కళాశాల ప్రత్యేక గుర్తింపు పొందింది. ఏపీలోనే 100 శాతం డిజిటల్ పద్ధతిలో విద్యాబోధన చేస్తున్న మొదటి కళాశాలగా రికార్డు సృష్టించింది. కొవిడ్-19 కారణంగా గత కొద్ది నెలలుగా విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా రెగ్యులర్‌గా తరగతులు నిర్వహిస్తున్నారు. అలాగే ఇ-లెర్నింగ్ వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేస్తున్నారు. దీంతోపాటు కోర్స్ ఎరా, యుడెమీ తదితర ప్రముఖ లెర్నింగ్ ప్లాట్‌ఫాంలలో విద్యార్థులకు సబ్‌స్క్రిప్షన్‌లు అందిస్తున్నారు. దీంతో వారు బిగ్ డేటా, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇండస్ట్రియల్ ట్రెయినింగ్, మాట్‌ల్యాబ్, ఆటోక్యాడ్ తదితర కోర్సులను ఆన్‌లైన్‌లో నేర్చుకుంటున్నారు.
కళాశాల విద్యార్థులకు విద్యాబోధన చేసేందుకు అందుబాటులో ఉన్న దాదాపు అన్ని సాంకేతిక పద్ధతులను యాజమాన్యం ఉపయోగించుకుంటూ పూర్తిగా డిజిటల్ విధానంలో తరగతులను నిర్వహిస్తోంది. టెక్నాలజీ ఆధారిత ప్లాట్‌ఫాంలు, టూల్స్‌తో వినూత్న రీతిలో విద్యాబోధన చేస్తున్నారు. అలాగే విద్యార్థులు, ప్రొఫెసర్లు ఒకే వేదికపైకి వచ్చేలా జూమ్, వెబ్ఎక్స్ తదితర వీడియో కాన్ఫరెన్స్ యాప్‌లను వాడుతున్నారు. దీంతో విద్యార్థులు ఆయా పాఠ్యాంశాల్లో తమకున్న సందేహాలను చాలా సులభంగా తీర్చుకుంటున్నారు. ఇక ఇన్‌స్ట్రక్చర్స్ కాన్వాస్, బ్లాక్‌బోర్డ్, గూగుల్ క్లాస్ రూం తదితర అధునాతన లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లను కాలేజీలో ఉపయోగిస్తున్నారు.
ఆ సాఫ్ట్‌వేర్ సహాయంతో పరీక్షలు..
విద్యార్థులు పాఠ్యాంశాలపై మరింత శ్రద్ధ పెట్టేలా వారికి ప్రొక్టొరియో సాఫ్ట్‌వేర్ సహాయంతో ఆన్‌లైన్‌లోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా నేపథ్యంలో డిజిటల్ విద్యకు మరింత డిమాండ్ ఏర్పడనున్న దృష్ట్యా కాలేజీ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ విధంగా అధునాతన సాంకేతిక పద్దతుల్లో వారికి విద్యాబోధన చేస్తోంది. దీంతోపాటు వినూత్నమైన విద్యా విధానాలను అనుసరిస్తూ, అనేక రకాల డిజిటల్ టూల్స్‌తో విద్యార్థులు చదువుకుంటున్నారు.