Nara Lokesh condemns CM Jagan silence: ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ సీఎం కు లేఖ రాసారు. విద్యుత్ రాయితీ, దాణా రేట్లు తగ్గేలా చర్యలు తీసుకుని , రొయ్యలకు మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలని లేఖలో కోరారు. ముఖ్యమంత్రి హామీలలో ఏ ఒక్కటీ అమలు కాకపోవడమే నేటి ఆక్వారంగ సంక్షోభానికి కారణమని ధ్వజమెత్తారు. దేశంలోనే ఆక్వా ఉత్పత్తుల్లో ప్రథమస్థానంలో వున్న ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆక్వా హాలీడే దిశగా సాగుతోందని మండిపడ్డారు. ఆక్వా అసోసియేషన్ల పేరుతో ప్రకటనలు, అంతఃపుర కమిటీల రాయబేరాలు ఆక్వారంగ సంక్షోభాన్ని పరిష్కరించలేవని లేఖలో తెలిపారు. రొయ్యలు పెంపకం చేపట్టే రైతుల పాలిట శాపంగా మారిన సమస్యలు యుద్ధప్రాతిపదికన పరిష్కరించినప్పుడే ఆక్వారంగానికి పూర్వవైభవం వస్తుందన్నారు.
ఆక్వా పరిశ్రమకి విద్యుత్: ఆక్వా పరిశ్రమకి విద్యుత్ యూనిట్ కు 1.50కే ఇస్తానని హామీ ఇచ్చి జగన్ గద్దెనెక్కాక మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటి తుడుపుగా ప్రకటించిన విద్యుత్ రాయితీ అడ్డగోలు నిబంధనతో అందకుండా పోతోందని విమర్శించారు. దాణా రేట్లు పెరిగిపోయాయి, రొయ్యలకి వ్యాధులు సోకకుండా వాడే మందుల ధరలు మండిపోతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా కల్చర్ అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీ సడా) కింద నమోదు చేసుకున్న 10 ఎకరాల్లోపు చెరువులలో రొయ్యల పెంచే రైతులకే విద్యుత్ రాయితీ వర్తించేలా జీవో ఇవ్వడం ఆక్వా రంగం పాలిట శాపంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. పది ఎకరాలు దాటిన ఆక్వా రైతులు, ఆక్వాజోన్ పరిధిలో లేని చెరువులు, కౌలుదారులు విద్యుత్ రాయితీ అందక.. యూనిట్ ధర 3.85 పడటంతో ఎకరాకు 18వేలు అదనపు భారం పడుతోందన్నారు.