Nara Lokesh Video Conference With TDP Leaders: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో పాటు.. అనంతర పరిణామాలపై ముఖ్యనేతలతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన చేపట్టిన యువగళం పాదయాత్ర.. చంద్రబాబు అరెస్టుతో నిలిపివేయగా.. దానిని లోకేశ్ తిరిగి ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని వచ్చే వారం నుంచే తిరిగి ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ సంవత్సరం జనవరి 27వ తేదీన ప్రారంభమైన యువగళం పాదయాత్ర.. చంద్రబాబు అరెస్టుతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నిలిచిపోయింది.
అయితే ప్రస్తుతం పాదయాత్ర నిలిచిన రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచే లోకేశ్ యువగళాన్ని ప్రారంభించనున్నారు. చంద్రబాబు అరెస్టు, తదనంతర పరిణామాలపై పార్టీ ముఖ్య నేతలతో లోకేశ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ.. మద్దతుగా నిలుస్తున్న వివిధ వర్గాల ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా.. చంద్రబాబుపై అవినీతి మరకలు వేయలేకపోయారని టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు.
ప్రజలు, టీడీపీ శ్రేణులు చేపట్టిన నిరసన కార్యక్రమాలను ప్రభుత్వం పోలీసులతో అణచివేయటం.. కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. చంద్రబాబుపై అక్రమ కేసుల విషయంలో దిల్లీ న్యాయవాదులతో నిత్యం సంప్రదిస్తున్నట్లు లోకేశ్ తెలిపారు. అటు చంద్రబాబు అరెస్టుపై పోరాడుతునే.. యువగళం పాదయాత్రతో మళ్లీ రోడ్డెక్కాలని నిర్ణయించారు. చంద్రబాబు అక్రమ అరెస్టు, జగన్ రాజకీయ కక్ష సాధింపు గురించి మరింత ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు.. టీడీపీ నాయకులు ఇంటింటీకి వెళ్లి ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.