వైకాపా ప్రభుత్వం స్కామ్‌ల కోసమే పథకాలు తీసుకొస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. పాదయాత్రలో ముద్దులు పెట్టి ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నారని విమర్శించారు. వైకాపా ఏడాది పాలనపై 'విధ్వంసానికి ఒక్క ఛాన్స్' పేరిట ఆయన ఛార్జిషీట్ విడుదల చేశారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఏడాది అయ్యిందని దుయ్యబట్టారు.
'వైకాపా అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 564 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతులకు పెద్దపీట వేస్తామని చెప్పిన ప్రభుత్వం... కనీసం విత్తనాలు కూడా ఇవ్వలేదు. పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చారు. రూ.250 మాత్రమే పెంచారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు పింఛన్లు ఇస్తామన్నారు.. ఇప్పుడు వాటి ఊసేలేదు. వాటి గురించి అడిగితే జైలుకు పంపే పరిస్థితి వచ్చింది. మద్య నిషేధం అమలుపై గొప్పలు చెప్పారు. ఇప్పుడు జే ట్యాక్స్ పేరిట ప్రజలను దోచుకుంటున్నారు. అమ్మ ఒడి పథకం అర్ధఒడిగా మారింది. 83 లక్షల మంది విద్యార్థులకు బదులు 43 లక్షల మందికే ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ కాపు కార్పొరేషన్ నిధులు మళ్లించారు'
- నారా లోకేశ్, తేదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి
'వైకాపా నేతలే ఇసుకను బొక్కేస్తూ... దొరకట్లేదని చెబుతున్నారు. మరోవైపు విద్యుత్ తీగ పట్టుకుంటే కాదు.. బిల్లు ముట్టుకుంటే షాక్ కొడుతోంది. విద్యుత్ రంగంలో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతోంది. కరోనా టెస్టింగ్ కిట్లలో కుంభకోణానికి పాల్పడ్డారు. బ్లీచింగ్ పౌడర్ పేరుతో సున్నం పోసి రూ.70 కోట్లు కాజేశారు. పేద ప్రజలకు భూముల పంపిణీ దేశంలోనే పెద్ద కుంభకోణం. ఒక్క నియోజకవర్గంలో ఆవ భూముల్లో రూ.222 కోట్ల కుంభకోణం జరిగింది' అని లోకేశ్ విమర్శించారు.