Nara Lokesh: తాడేపల్లి పట్టణం ప్రకాష్‌నగర్‌లో బాదుడే బాదుడు కార్యక్రమంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైకాపా పాలనలో ప్రజలపై పడుతున్న భారం వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.పేద, మధ్య తరగతి కుటుంబాలకు తెదేపా పాలనలో నెలకు రూ.4వేలు మిగులు ఉంటే,.. వైకాపా పాలనలో రూ.9వేలు లోటు ఉంటోందని వివరిస్తూ ఇంటింటికీ వెళ్లిన లోకేశ్ వివరించారు. నెలకు రూ.9వేలు చొప్పున ఏటా రూ.1,08,000 దోచేస్తున్నారని మండిపడ్డారు. 2019 వరకు నెలకు రూ.11వేలు ఖర్చులకు సరిపోతే.. ఇప్పుడు రూ.20 వేలవుతున్నాయని ధ్వజమెత్తారు.
అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం అమలు చేస్తానన్న సీఎం జగన్.. ఇప్పుడు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని లోకేశ్ ధ్వజమెత్తారు. జే బ్రాండ్స్‌తో మహిళల మెడలో పుస్తెలు తెంపుతున్నారని దుయ్యబట్టారు. ఇటీవల మరణించిన తెదేపా కార్యకర్తల కుటుంబ సభ్యులను లోకేశ్ పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న కార్యకర్తలను కలిసి వారికి భరోసానిచ్చారు. కొండ ప్రాంత వాసులకు ఇళ్ల పట్టాలు ఇస్తామని ఎమ్మెల్యే ప్రజలు మోసగించారని ఎద్దేవా చేశారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్ల సమస్యలపై స్పందించట్లేదంటూ స్థానికుల ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటిని అర్ధరాత్రి వేళ సరఫరా చేస్తున్నారని స్థానిక మహిళలు లోకేశ్‌కు వివరించారు. ప్రజలపై పన్నుల భారం మోపి.. ప్రజల్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. చెత్త పన్నుపేరుతో ప్రజల్ని వేధించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు.