Nara Lokesh Meet Amaravati Farmers : అమరావతి రైతుల పోరాటం ఐదుకోట్ల ఆంధ్రుల కోసమే అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. రాష్ట్రం కోసం ఎంతో విలువైన భూములు త్యాగం చేశారన్న లోకేశ్.. మరో 9 నెలలు ఓపిక పట్టాలని అమరావతి రైతులను ఉద్దేశించి భరోసా కల్పించారు. మనం కోరుకున్న రాష్ట్రం ఇదేనా అని ప్రతిఒక్కరూ ఆలోచించాలని అన్నారు. అమరావతి ఉద్యమం వల్లే తొలిసారి పోలీస్ స్టేషన్‌కు వెళ్లానని గుర్తు చేసుకున్నారు. తల్లి, చెల్లిని మోసం చేసిన వ్యక్తి.. మిగతావారికి న్యాయం చేస్తారా? అని ముఖ్యమంత్రి జగన్ను ఉద్దేశించి విమర్శించారు.యువగళం పాదయాత్ర 183వ రోజు గుంటూరు జిల్లా రావెలలో కొనసాగుతుండగా.. 'అమరావతి ఆక్రందన' పేరుతో రాజధాని రైతులతో నారా లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Amaravati Farmers Protest: ఉక్కు సంకల్పంతో.. 1300 రోజులుగా అమరావతి ఉద్యమం
Reserve Zone అమరావతిలో రిజర్వ్ జోన్ రద్దు చేయాలని, భూముల క్రయవిక్రయాలు జరిపేందుకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు లోకేశ్ దృష్టికి తీసుకువచ్చారు. 41 జీవో రద్దు చేసి అసైన్డ్ రైతులను ఇబ్బంది పెట్టారని, అమరావతిలోని అసైన్డ్ రైతులకు కౌలు కూడా రావడం లేదు.. మేం ఎలా బతకాలి.. పిల్లలను ఎలా చదివించుకోవాలని రైతులు వాపోయారు. దీనిపై లోకేశ్ స్పందిస్తూ.. మేం వచ్చిన వెంటనే రిజర్వ్ జోన్ రద్దు చేస్తామని, మళ్లీ జీవో 41 అమలుచేసే బాధ్యత తీసుకుంటామని స్పష్టం చేశారు. 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులు బాధితులుగా మారారని,ప్రజల పక్షాన మాట్లాడిన ఉండవల్లి శ్రీదేవినీ ప్రభుత్వం ఇబ్బందులు పెట్టిందని చెప్పారు. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ అని ఆరోపించారని, వాస్తవానికి అమరావతి మెగా సిటీ అవుతుందని ఆనాడు చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. అమరావతికి మాస్టర్ ప్లాన్ ఇచ్చిన సింగపూర్ వాళ్లనూ పంపించేశారని లోకేశ్ పేర్కొన్నారు.
అక్రమ మట్టి తవ్వకాలను నిరసిస్తూ.. అమరావతిలో రోడ్డెక్కిన రైతులు
Assembly శాసనసభ వద్దకు వెళ్లామని తమపై కేసులు పెట్టారని రైతులు వాపోయారు. తనపై 31 కేసులు పెట్టి అన్ని స్టేషన్లలో తిప్పారని ఓ రైతు కన్నీటి పర్యంతమయ్యాడు. లాఠీలతో కొట్టారు.. బూటుకాళ్లతో తన్నారు.. పొలాల్లో పనిచేసే కూలీలను పలుచోట్లకు తీసుకెళ్లి ఇబ్బంది పెట్టారు.. పనిచేసుకుని బతకాలా.. వాయిదాలకు తిరగాలా? మేం ఇన్ని కష్టాలు పడుతుంటే నేతలు, అధికారులు ఏమయ్యారని రైతులు ప్రశ్నించారు. అమరావతి రైతులను జైలుపాలు చేయడమే పోలీసుల పనా? మాకు కౌలు డబ్బు కూడా సరిగా వేయడం లేదని లోకేశ్ దృష్టికి తీసుకువచ్చారు. వైసీపీ పాలనలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్న రైతులు.. కడుపునిండా తిని, కంటినిండా నిద్రపోయి.. నాలుగేళ్లు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్గగుడికి వెళ్తున్నా పోలీసులు అడ్డుకుని కొట్టారని, మేం దొంగలమా.. నక్సలైట్లమా..? అని మహిళా రైతులు దుయ్యబట్టారు. రాజధాని కోసం భూములిచ్చి మనోవేదన చెందుతున్నామని, భూములు ఇవ్వడమే మేం చేసిన తప్పా?.. మేం, మా బిడ్డలు చేసిన తప్పు ఏంటి? అని వాపోయారు.