వరదలతో పంటలు దెబ్బతిని ఆదుకోవాలని వేడుకుంటున్న రైతులపై మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేయడం ఏంటని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. కష్టాల్లో ఉన్న ప్రజలను అదుకోవాల్సింది పోయి వారిపైనే ఎదురుదాడికి దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం లంక గ్రామాల్లో పర్యటించిన వైకాపా ప్రజాప్రతినిధుల బృందానికి ప్రజాసమస్యలు వినే ఓపిక కూడా లేకపోవడం దారుణమన్నారు. రైతులు, ప్రజలు బిక్కుబిక్కుమంటూ వరద నీళ్లలో ఉన్నారని.. ఇప్పటికైనా సీఎం జగన్ మేల్కోవాలని హితవు పలికారు. రైతులు, వైకాపా ప్రజాప్రతినిధుల మధ్య జరిగిన వాగ్వాద వీడియోను ట్వీట్ చేశారు.