'సీఎం నోట ఆ మాట వచ్చేెంతవరకు పోరాటం ఆగదు' - కృష్ణాయపాలెంలో వామపక్ష నేతలు
స్వాతంత్య్రం కోసం గాంధీజీ చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని అమరావతి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని రైతులకు తెలుగుదేశం జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. కృష్ణాయపాలెంలో 60 గంటల నిరాహారదీక్ష చేస్తున్న నలుగురు యువకులకు నారా లోకేశ్, వామపక్ష నేతలు ముప్పాళ్ల నాగేశ్వరరావు, బాబురావులు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోట రాజధానిగా అమరావతినే కొనసాగిస్తామని ప్రకటన వచ్చేంత వరకు పోరాటం ఆగదని నారా లోకేశ్ స్పష్టం చేశారు. రాజధాని కోసం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో 60 గంటల నిరాహారదీక్ష చేస్తున్న నలుగురు యువకులకు నారా లోకేశ్, వామపక్ష నేతలు ముప్పాళ్ల నాగేశ్వరారవు, బాబురావులు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు. రైతులంతా ఐదుకోట్ల ప్రజల శ్రేయస్సు కోసం భూములిచ్చారని నారా లోకేశ్ అన్నారు. రాజధాని అంటే కుటుంబంతో సమానమని....జగన్ మాత్రం తండ్రిని కర్నూలు, తల్లిని విశాఖ, పిల్లలను అమరావతిలో పెట్టి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాడని మండిపడ్డారు. 45మంది రైతులు మృతిచెందితే ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యులైనా వచ్చి పరామర్శించారా అని లోకేశ్ నిలదీశారు. రాజధాని కోసం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకైనా దిగుతామని సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు చెప్పారు. రాజధానిగా అమరావతినే కొనసాగించేంత వరకు పోరాటాలు చేస్తామని సీపీఎం నేత బాబురావు తెలిపారు.