Nandamuri Taraka Ratna Death :నటుడు నందమూరి తారకరత్న (40) కన్నుమూశారు. నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో గత 23 రోజులుగా చికిత్స పొందుతూ .. శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. తారకరత్న పార్థివదేహాన్ని శనివారం రాత్రి పది గంటలకు ప్రత్యేక వాహనంలో హైదరాబాద్ తరలించారు. ఆదివారం హైదరాబాద్‌లో తారకరత్న పార్థీవదేహానికి అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. జనవరి 27న యువగళం పాదయాత్రలో తీవ్ర అస్వస్థతకు గురైన తారకరత్నను.. 28 వ తేదిన బెంగళూరు నారాయణ హృదయాలయలో తారకరత్నకు చికిత్స కోసం తరలించారు.
హైదరాబాద్కు తారక్ పార్థివదేహం :బెంగుళూరు నుంచి ప్రత్యేక వాహనంలో బయల్దేరిన తారకరత్న పార్దివదేహం హైదరాబాద్ మోకిలలోని ఆయన నివాసానికి ఆదివారం ఉదయం చేరుకుంది. ఈ రోజు తారక్ భౌతికకాయాన్ని సినీ, రాజకీీయ ప్రముఖుల సందర్శనార్థం.. ఆయన నివాసంలోనే ఉంచనున్నారు. సోమవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఫీలీం ఛాంబర్లో ఉంచనున్నారు. అనంతరం అంత్యక్రియలు పూర్తి చేయనున్నారు.
నందమూరి మోహన కృష్ణ కుమారుడు తారకరత్న. తారకరత్న అలేఖ్యారెడ్డిని 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అలేఖ్యారెడ్డి నందీశ్వరుడు చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసింది. తారకరత్న 20 ఏళ్ల వయస్సులోనే కథానాయకుడిగా తెరంగేట్రం చేసిశారు. తారకరత్నకు ఒక పాప. 2001లో ఒకటో నంబర్ కుర్రాడు చిత్రంతో తెలుగు తెరకు నటుడిగా పరిచయ్యారు. మెుత్తం ఒక వెబ్ సిరీస్ , 22 చిత్రాల్లో నటించారు. తారకరత్న 2006 తర్వాత మూడేళ్లు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. 2009లో అమరావతి చిత్రంతో మళ్లీ సినీ జీవితాన్ని మొదలుపెట్టారు. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అమరావతి చిత్రంలో ప్రతినాయకుడిగా నటించారు. అమరావతి చిత్రానికి ఉత్తమ ప్రతినాయకుడిగా నంది అవార్డు అందుకున్నారు. రాజా చెయ్యి వేస్తే అనే చిత్రంలోనూ ప్రతినాయకుడిగా నటించిన సారథి చిత్రం విడుదలకావల్సి ఉంది.
తారకరత్న నటించిన చిత్రాలుః ఒకటో నెంబర్ కుర్రాడు, యువరత్న, తారక్, నో, భద్రాద్రి రాముడు, అమరావతి, వెంకటాద్రి, ముక్కంటి, నందీశ్వరుడు, విజేత, ఎదురులేని అలెగ్జాండర్, చూడాలని చెప్పాలని, మహాభక్త సిరియాల కాకతీయుడు, ఎవరు, మనమంత, రాజా చెయ్యి వేస్తే, ఖయ్యూంబాయ్, దేవినేని, ఎస్ 5 నో ఎగ్జిట్, సారథి చిత్రాల్లో నటించారు.
వరల్డ్ రికార్డు ఒకేసారి 9 సినిమాలు మొదలుపెట్టి వరల్డ్ రికార్డు సృష్టించిన తారకరత్న 9 చిత్రాల్లో 5 చిత్రాలు మాత్రమే విడుదలయ్యాయి. ఒకటో నెంబర్ కుర్రాడు, యువరత్న, తారక్, నో, భద్రాద్రి రాముడు చిత్రాలు విడుదల అయ్యాయి.
ప్రముఖుల సంతాపం..
"తారక రత్న మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. సినీ నటుడు, ఎన్టీఆర్ మనవడు నందమూరి తారకరత్న మృతి పట్ల సంతాపం తెలుపుతూ.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ప్రకటనను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది." -జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి
'నందమూరి తారకరత్న మరణ వార్త తీవ్రమైన దిగ్భ్రాంతిని, బాధను కలిగించింది. తారకరత్నను బ్రతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, కుటుంబ సభ్యుల, అభిమానుల ప్రార్థనలు, అత్యంత నిపుణులైన డాక్టర్ల వైద్యం ఫలితాన్ని ఇవ్వలేదు. 23 రోజుల పాటు మృత్యువు తో పోరాడిన తారకరత్న... చివరికి మాకు దూరం అయ్యి మా కుటుంబానికి విషాదం మిగిల్చాడు. తారకరత్న ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.'- టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
'బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించదు. నేనున్నానంటూ నా వెంట నడిచిన ఆ అడుగులు చప్పుడు ఆగిపోయింది. నందమూరి తారకరత్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగుదేశం యువతేజం తారకరత్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. నిష్కల్మషమైన నీ ప్రేమ, స్నేహ బంధం మన బంధుత్వం కంటే గొప్పది. తారకరత్నకి కన్నీటి నివాళులతో.'- నారా లోకేష్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి