Kolla Rajamohanrao house arrest: గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో నల్లమడ రైతు సంఘం అధ్యక్షులు డాక్టర్ కొల్లా రాజమోహన్ రావును పోలీసులు గృహనిర్బంధం చేశారు. చిలకలూరిపేటలోని ఆయన స్వగృహంలోనే శుక్రవారం రాత్రి నుంచి నిర్బంధించారు. ఆయన గతంలో గుంటూరు ఛానల్ పొడగింపు సమస్యపై రైతులతో కలిసి పెద్ద ఎత్తున పాదయాత్ర కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇదే సమస్యపై శనివారం ప్రత్తిపాడు వస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలసి వినతి పత్రం ఇవ్వాలని భావించారు.
సీఎం కార్యక్రమానికి వెళ్లడానికి వీల్లేదంటూ చిలకలూరిపేట అర్బన్ పోలీసులు ఆయనను గృహనిర్బంధం చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న వారిని గృహనిర్బంధం చేయడం దుర్మార్గం అని డాక్టర్ కొల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గుంటూరు ఛానల్ పొడిగింపు సమస్యను పరిష్కరించాలని లేకపోతే రైతులతో కలిసి ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.