Nagula Chavithi: రాష్ట్ర వ్యాప్తంగా నాగులచవితి పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని పుట్టలకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆయా ప్రాంతాలకు భక్తులు పోటెత్తారు. పుట్టలో పాలు పోసి పూజలు చేశారు. బాపట్ల జిల్లాలోని బాపట్ల, చీరాల, వేటపాలెం, చినగంజాం, పర్చూరు, ఇంకొల్లు, మార్టూరు ప్రాంతాల్లోని పుట్టల వద్ద భక్తులు నాగేంద్రస్వామికి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
కేంద్రపాలిత యానంలోనూ నాగుల చవితి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. కోనసీమ జిల్లాలోని తాళరేవు, ఐ.పోలవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం మండలాల్లో నాగులచవితిని వైభవంగా జరుపుకున్నారు. కోనసీమ వ్యాప్తంగా నాగుల చవితి పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు నాగేంద్రుని కొలుస్తూ పూజలు చేశారు. ప్రకాశం జిల్లాలోనూ యర్రగొండపాలెంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.