NADU-NEDU PHASE 2 WORKS: ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలను కల్పించే ‘నాడు- నేడు ’ రెండో దశ పనులకు సిమెంటు, ఇసుక కొరత ఏర్పడింది. చాలాచోట్ల పనులు నిలిచిపోయాయి. ప్రభుత్వ పనులకు ప్రాధాన్యం ఇస్తున్నామని అధికారులు చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో ఇసుక సమస్య తీవ్రంగా ఉంది. అన్ని విద్యా సంస్థల్లో పనులకు 5.88 లక్షల టన్నులు కావాలని ఇండెంట్ పెట్టినా ఇప్పటివరకు 1.08 లక్షల టన్నులే సరఫరా చేశారు.
సిమెంటు కోసం ఆన్‌లైన్‌లో విద్యా సంస్థలు అడుగుతున్నా సకాలంలో ఇవ్వడం లేదు. కొన్నిచోట్ల పనులు నిలిచిపోగా.. మరికొన్నిచోట్ల నత్తనడకన సాగుతున్నాయి. వాస్తవంగా గతేడాది ఆగస్టు 16న సీఎం జగన్ రెండో విడతకు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది జులై నాటికే పనులను పూర్తి చేస్తామని అప్పట్లో ప్రకటించారు. పరిపాలనా అనుమతులు ఇచ్చేందుకే సుమారు ఏడాది సమయం పట్టింది. ఈ ఏడాది జూన్‌లో 22,344 విద్యా సంస్థల్లో ‘నాడు-నేడు ’ రెండో విడత చేపట్టేందుకు పరిపాలనా అనుమతులను ప్రభుత్వం ఇచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నా ఆ పరిస్థితి కనిపించడం లేదు..
ఇసుక సరఫరాకు మండలాల్లో డంపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల పాఠశాలకు 9 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇసుక తరలింపునకు అదనపు వ్యయం కావడం సమస్యగా మారుతోంది. కొన్ని పాఠశాలలు డబ్బులు ఖర్చు చేసినా బిల్లులు రావడం లేదు. కడప జిల్లాలోని ఓ పాఠశాల కమిటీ సుమారు 30 లక్షల వరకు వ్యయం చేయగా.. ఇంత వరకు బిల్లులు విడుదల కాలేదు. కొన్నిచోట్ల సిమెంట్ లేనందున పనులు నిలిపేస్తున్నారు. మరికొన్ని చోట్ల ఇసుక, సిమెంటు ఉన్నా పని చేసేవారికి ఇచ్చేందుకు డబ్బులు ఉండటం లేదు.