ప్రభుత్వ బడుల్లో అసంపూర్తిగా నాడు-నేడు పనులు Nadu Nedu Second Phase Works Runs Slowly: ప్రభుత్వ పనులన్నీ మీ కళ్ల ముందే కనిపిస్తున్నాయి.! ప్రతీ సభలో సీఎం జగన్ చెప్పే మాట ఇది.! వేసవి సెలవుల తర్వాత బడికి వెళ్లిన పిల్లలకూ ఆ అనుభవం ఎదురైంది. మే నెలాఖరు నాటికే పాఠశాలల్లో పూర్తికావాల్సిన నాడు-నేడు రెండో విడత పనులు ఇంకా కొలిక్కిరాలేదు. 13 వేల పైచిలుకు అదనపు తరగతి గదులు నిర్మిస్తున్నామని ఊదరగొట్టిన జగన్ మామయ్య కేవలం 134 మాత్రమే పూర్తిచేయించారు. పాఠశాలలు తెరిచేలోగా.. పనులన్నీ పూర్తిచేస్తామంటూ ప్రతీ సమీక్షలో సీఎం చెప్పిన గొప్పలు.. లక్ష్యానికి ఆమడదూరంలో ఉన్నాయి.
పాఠశాల ఆవరణలో కంకర, ఇసుక ఇతర నిర్మాణ సామాగ్రి. చూస్తే అదేదో నిర్మాణ దశలో ఉన్న ఇల్లు కావచ్చు అనుకునే విధంగా ఉంది. ఇసుక కుప్పలు. రాశుల కొద్ది కంకర. భవన నిర్మాణం కోసం పేర్చిన కర్రలు, ఇతర సామాగ్రి. తరగతి గదుల్లో పదుల సంఖ్యలో సిమెంట్ బస్తాలు. ఇదీ ప్రకాశం జిల్లాలోని ఓ సర్కారీ బడి ఆవరణలోని పరిస్థితి. వేసవి సెలవుల తర్వాత పాఠశాలకు వెళ్లిన పిల్లలకు ఇవే స్వాగతం పలికాయి. నాడు-నేడు పథకం కింద మా బడిని జగన్ మామయ్య ఎలా మార్చేశారో అంటూ వెళ్లిన పిల్లలకు.. ఈ మొండి గోడలు, అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలే కనిపించాయి.
ఇదొక్కటే కాదు ప్రకాశం జిల్లాలోని అనేక ప్రభుత్వ పాఠశాలల్లో తలపెట్టిన నాడు-నేడు పనుల పరిస్థితి ఇదే. నాడు-నేడు రెండో విడతలో ప్రకాశం జిల్లాలో 564 అదనపు తరగతి గదుల నిర్మాణాలు ప్రారంభించారు. అందులో పూర్తైంది పట్టుమని పది మాత్రమే. 185 ప్రహరీ గోడలకు 9 పూర్తయ్యాయి. 563 మరుగుదొడ్లకు 80, 362 వంటగదులకు 56, 538 విద్యుత్తు పనులకు 87 మాత్రమే పూర్తయ్యాయి. నిజానికి ఇవన్నీ మే నెలాఖరుకే పూర్తి కావాలి. కానీ జూన్ ఆఖరుకైనా పూర్తవుతాయా అంటే ఎవరూ భరోసా ఇవ్వలేదని పరిస్థితి.
నిర్ణీత సమయానికి నిధులు విడుదల కాకపోవడం.. నిర్మాణ సామాగ్రి రాకపోవడం వల్లే పనులు అసంపూర్తిగా వెక్కిరిస్తున్నాయనే విమర్శలున్నాయి.అధికారులు మాత్రం అదనపు గదుల నిర్మాణాలు పూర్తికాని చోట్ల ఉన్న గదుల్లోనే విద్యార్థుల్ని సర్దుబాటు చేస్తామని అంటున్నారు.
Mana Badi Nadu Nedu: మన బడి, నాడు-నేడు రెండో దశ పనులు భారీగా కుదింపు
"ప్రభుత్వం ఆదేశాల ప్రకారమే పనులు పూర్తి చేస్తున్నాము. ఇంటీరీయర్ ముందుగా పూర్తి చేసుకోండని ఆదేశించింది. . దానివల్ల పిల్లలకు ఇబ్బంది కలగదని సూచించారు. అందువల్ల ఇంటీరీయర్ పూర్తి చేసి సిద్ధంగా ఉంచుతున్నాము." -అజయ్ కుమార్, ఎంఈఓ
కడప జిల్లాలోనూ అదే పరిస్థితి..
ఇది సీఎం సొంత జిల్లా ప్రొద్దుటూరులోని ఊటుకూరు వీరయ్య ప్రభుత్వ బాలుర పాఠశాల. ఇందులోనూ నాడు-నేడు పనులు అసంపూర్ణంగానే ఉన్నాయి. తరగతి గదుల్లో ఫ్యాన్ల రెక్కలు వంగిపోయాయి. బాలుర మరుగుదొడ్లు అద్వానంగా ఉన్నాయి. మోడంపల్లి ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో గదులు సరిపోక.. కొందరు విద్యార్థులను వరండాలో కూర్చోబెట్టారు. నాడు నేడు పనులు.. సకాలంలో పూర్తై ఉంటే పిల్లలకు ఈ బాధ తప్పేది.
అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం హెచ్. చెర్లోపల్లె జిల్లా జడ్పీ పాఠశాలలోనూ అంతే..! పెచ్చులూడిన చోట కాస్త సిమెంట్ పెట్టి మమ అనిపించారు. ఇక అదనపు తరగతి గదులైతే.. గోడల స్థాయిలోనే నిలిచిపోయాయి. వాటిలో పిల్లలకు పాఠాలు ఎలా బోధిస్తారో తెలియని పరిస్థితి..! ఇక తాళ్లపాకలోనూ అదే పరిస్థితి. పనులు నత్తనడకన సాగుతూనే ఉన్నాయి. ఇవీ రెండూ నాడు-నేడు పనుల అసంపూర్తికి. చిన్న ఉదాహరణ మాత్రమే.
నాడు-నేడు రెండో దశ కింద 13వేల 860 అదనపు తరగతి గదుల్ని.. నిర్మించాల్సి ఉంది. అయితే పూర్తి చేసింది మాత్రం కేవలం 134 మాత్రమే. మరొక 1074 పనులు వివిధ దశల్లో ఉన్నాయని స్వయంగా పాఠశాల విద్యాశాఖే ప్రభుత్వానికి నివేదించింది. 5 వేల 565 అదనపు తరగతి గదులు బేస్‌మెంట్ స్థాయినీ దాటలేదు.
ఆరు వేల చోట్ల పాఠశాలల ప్రహరీ గోడల నిర్మాణానికి ప్రతిపాదించగా ఇప్పటికి 200 మాత్రమే పూర్తి అయ్యాయి. 3 వేల 787 చోట్ల బేస్మెంట్ స్థాయినీ దాటలేదు. ఇక రెండో దశ కింద 9వేల 226 వంట గదులు ప్రతిపాదిస్తే అందులో పూర్తైంది కేవలం 199 మాత్రమే. ఇక 14 వేల 25 చోట్ల పాఠశాలల్లో మరుగుదొడ్లకు మరమ్మతులు చేయాలని ప్రణాళికలు వేశారు. అందులోనూ పూర్తైంది కేవలం 256 చోట్లే. 9 వేల 466 పాఠశాలల్లో పనులు పూర్తయ్యే దశలో ఉన్నాయని ప్రభుత్వం చెప్పుకొస్తోంది.
నాడు-నేడు లో భాగంగా పాఠశాల తరగతి గదుల్లో విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు, కిచెన్ షెడ్లు, పెయింటింగ్ పనులు ప్రహరీల నిర్మాణం, ఫర్నిచర్ , అదనపు తరగతి గదుల నిర్మాణం, గ్రీన్ చాక్ బోర్డులు, నీటి సదుపాయంతో మరుగుదొడ్ల నిర్మాణం, స్మార్ట్ టీవీలు, ఐఎఫ్‌పీ ప్యానల్స్ వంటివి ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకోసం 8 వేల కోట్ల రూపాయల బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అయితే ఇప్పటి వరకూ 2వేల 650 కోట్లు మాత్రమే ప్రభుత్వం ఖర్చు చేసింది. నాడు నేడు పనుల్లో ఇప్పటికీ రూ. 637 కోట్ల రూపాయల మేర కాంట్రాక్టర్లకు బిల్లులు బకాయిలున్నట్లు తెలుస్తోంది. ఇవెప్పుడిస్తారో మిగతా పనులు ఎప్పటికి పూర్తి చేయిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.