గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన ఓ స్థిరాస్తి వ్యాపారి హత్య సంచలనం రేకెత్తించింది. రోజూ లక్షల రూపాయల విలువజేసే స్థలాలతో క్రయవిక్రయాలు చేస్తుంటాడు. అందరినీ పలకరిస్తూ తిరిగే అతను సొంత కొడుకు మనసును మాత్రం అర్థం చేసుకోలేకపోయాడు. ఈలోగా అకస్మాత్తుగా హత్యకు గురయ్యాడు.
2019లో రియల్టర్ వద్ద పని చేస్తున్న మధ్యవర్తి హత్యకేసులో నిందితులుగా ఉన్న మల్లిఖార్జునరావు, కుమారుడు సాయికృష్ణ ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చారు. ఈ క్రమంలో.. 7న మల్లిఖార్జునరావు గాయత్రీనగర్‌లోని తన వెంచర్ వద్ద అతి కిరాతకంగా హత్యకు గురయ్యాడు. పాత గొడవలే ఇందుకు కారణమనే కోణంలో పోలీసులు విచారణ జరిపారు. కానీ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నిందితులను చాకచక్యంగా కనుగొన్నారు.
ఇంతకీ ఏమైందంటే..
యూకేలో చదువుకున్న సాయికృష్ణ జల్సాలకు అలవాటు పడ్డాడు. ఇంటికి వచ్చిన తరువాత తండ్రిలాగా సొంతంగా తాను కూడా వ్యాపారం చేయాలనుకున్నాడు. తన మనసులోని మాటను తండ్రికి చెప్పాడు.. కానీ దానికి తండ్రికి ఒప్పుకోలేదు.. ఇప్పుడుకాదు తరువాత చూద్దామన్నాడు. అందుకు సాయికృష్ణ ససేమిరా అన్నాడు. ఈలోగా తండ్రి వివాహేతర సంబంధం విషయం తెలిసింది. ఈ విషయంలో సాయికృష్ణ తరచూ తండ్రితో గొడవపడేవాడు. ఆ మహిళకు అడిగినంత డబ్బు, బంగారం ఇస్తూ తనను పట్టించుకోవడంలేదని కక్ష పెంచుకున్నాడు.
రూ. 20 లక్షలిచ్చిసుపారీ గ్యాంగ్‌తో ప్లాన్ ..
మల్లికార్జునరావు (60) నరసరావుపేట పట్టణ శివారు రావిపాడు పంచాయతీ పరిధిలో ఉన్న వెంచర్ వద్దకు ప్రతిరోజు ఉదయం తన ద్విచక్ర వాహనంపై వెళుతుండేవాడు. ఈ క్రమంలో ఈ నెల 7న రోజు మాదిరిగానే వెంచర్ వద్దకు వెళుతుండగా.. మార్గమధ్యలో కిరాయి నిందితులు ముందుగా వేసుకున్న పథకం ప్రకారం.. అతని కళ్లల్లో డిటర్జెంట్ పౌడర్(DETERGENT POWDER) చల్లడంతో వాహనంపై నుంచి కింద పడ్డాడు. దుండగులు వారి వెంట తెచ్చుకున్న మారణాయుధాలతో మెడ, కాళ్లపై నరికి కిరాతకంగా హత్యచేశారు. తండ్రి హత్య కోసం సాయికృష్ణ రూ. 20 లక్షలు సుపారీ చెల్లించినట్లు పోలీసుల విచారణలో బయటపడింది.
సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుల గుర్తింపు..
కేసు వివరాలు వెల్లడిస్తున్న అదనపు ఎస్పీ మూర్తి.. ఈ హత్య కేసును గుంటూరు గ్రామీణ పోలీసులు ఛేదించారు. హత్యకు కారణమైన ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. కేసును లోతుగా దర్యాప్తు చేయగా విస్తుగొలిపే వాస్తవాలు బయట పడ్డాయి. నిందితుల్లో రియల్టర్ కుమారుడు ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరు పరారీలో ఉన్నారని.. వారికోసం గాలింపు జరుపుతున్నట్లు అదనపు ఎస్పీ మూర్తి వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తులు, ఇనుప రాడ్లు, ఆటో, బైక్, సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో సెల్‌ఫోన్ సిగ్నల్స్ కీలకంగా మారాయని పోలీసులు తెలిపారు.
రియల్టర్ మల్లిఖార్జునకు మరో మహిళతో పరిచయం ఉంది. ఆమెతో సన్నిహితంగా ఉంటూ ఆస్తిని దుబారా చేస్తున్నాడు. పైగా ఇంట్లో వారిని సరిగా పట్టించుకోకపోవడం, వ్యాపారం చేయాలనుకుంటున్న తనను చులకనగా మాట్లాడడంతో విసిగిపోయిన సాయికృష్ణ.. తండ్రిని అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. మిగిలిన ఆస్తినైనా తనవశం చేసుకోవాలని హత్యకు పథకరచన చేశాడు.
ఇదీ చదవండి:
కోర్టు ఉత్తర్వులున్నా ఎలా కూల్చేస్తారు: మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు