బావ, బావమరిది కలిసి వ్యాపారం చేశారు. ఈ క్రమంలో బావమరిది బావకు అప్పు పడ్డాడు. అది తీర్చమని అడిగినందుకు బావను నూతిలో తోసి హత్యాయత్నం చేశాడు. దీనిపై బావ గుంటూరు జిల్లా ఫిరంగిపురం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేశ్ తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం..
ఫిరంగిపురం మండలం ఎర్రగుంట్లపాడు గ్రామానికి చెందిన వెన్న సుబ్బారెడ్డి, సత్తెనపల్లి మండలం గుడుపూడిలోని హానిమిరెడ్డి బంధువులు. వరసకు బావ, బావమరుదులవుతారు. లహరి ఫెర్టిలైజర్ యజమానిగా ఉన్న హానిమిరెడ్డి.. అతని బావమరిది సుబ్బారెడ్డితో కలిసి మిరపకాయల వ్యాపారం చేశారు. ఈ క్రమంలో సుబ్బారెడ్డి.. హానిమిరెడ్డికి రూ. 35లక్షలు అప్పు పడ్డాడు. అప్పు తీర్చాలంటూ సుబ్బారెడ్డిని హానిమిరెడ్డి ఒత్తిడి చేశాడు.
ఈ నెల 21న అప్పు తీరుస్తానని చెప్పిన సుబ్బారెడ్డి.. హానిమిరెడ్డిని ఎర్రగుంట్లపాడుకు పిలిచాడు. సుబ్బారెడ్డి, తన ట్రాక్టర్ డ్రైవర్ అదెయ్య, హానిమిరెడ్డి కలసి పొలంలో మద్యం తాగారు. అదెయ్య అక్కడ నుంచి వెళ్లిపోయాక బావ, బావమరిది ఇంటికి బయలుదేరారు. మార్గంలో ఉన్న ఒక బావిలో తెల్లగా ఏదో కనిపిస్తుంది చూడమంటూ సుబ్బారెడ్డి బావకు చెప్పాడు. నూతిలో తొంగిచూస్తున్న హానిమిరెడ్డిని సుబ్బారెడ్డి కాలితో తన్ని బావిలో పడేశాడు. డబ్బులు ఇవ్వమని అడుగుతావా అంటూ రాళ్లు విసిరాడు.
సుబ్బారెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయాక.. హానిమిరెడ్డి బావిలో నుంచి బయటకు వచ్చాడు. అతను రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా సుబ్బారెడ్డి ద్విచక్రవాహనంపై వచ్చి ఢీకొట్టాడు. గాయపడిన హానిమిరెడ్డి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా సుబ్బారెడ్డి వెళ్లి అతనికి రూ.8.5లక్షలు ఇచ్చాడు. హత్యాయత్నం గురించి ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. దీనిపై హానిమిరెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
ఇదీ చదవండి:నోటీసులు ఇవ్వకుండా భవనాన్ని కూల్చడం దారుణం: అచ్చెన్నాయుడు