EC dismissed munugode Returning Officer: తెలంగాణలోని మునుగోడు ఉపఎన్నిక రిటర్నింగ్ అధికారిపై ఎన్నికల కమిషన్ వేటువేసింది. ఎన్నికల గుర్తుల గందరగోళానికి ముగింపు పలికిన ఈసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. యుగ తులసీ ఫౌండేషన్ అభ్యర్థికి తిరిగి రోడ్డు రోలర్ గుర్తును కేటాయిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంలో రిట్నరింగ్ అధికారి తీరును తీవ్రంగా పరిగణించిన ఎన్నికల కమిషన్ ఆర్వోను మార్చాలని నిర్ణయం తీసుకుంది.
కొత్త ఆర్వో కోసం ముగ్గురు పేర్లను అధికారులు ప్రతిపాదించగా సాయంత్రంలోగా కొత్త ఆర్వో నియామక ఉత్తర్వులు అందనున్నాయి. మునుగోడు ఉపఎన్నికలో యుగతులసి పార్టీ అభ్యర్థి శివకుమార్ గుర్తు మార్పు వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. రిటర్నింగ్ అధికారి తనకు లేని అధికారాన్ని ఉపయోగించి గుర్తు మార్చారని ఆక్షేపించిన ఈసీ.. విధి నిర్వహణలో తీవ్ర లోపం ఉన్నట్లు మండిపడింది. ఈ మేరకు ఆర్వోను మార్చాలని నిర్ణయించింది.
సాయంత్రంలోగా కొత్త ఆర్వో నియామక ఉత్తర్వులు అందనున్నాయి. యుగతులసి అభ్యర్థి ఫిర్యాదు ఆధారంగా నివేదికలను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం.. మొదట రోడ్ రోలర్ గుర్తు కేటాయించి, ఆ తర్వాత కనీసం ఎన్నికల పరిశీలకునికి కూడా ఎలాంటి సమాచారం లేకుండా గుర్తు మార్చి బేబీవాకర్ ఇచ్చినట్లు తేల్చింది. గుర్తు మార్పు విషయమై సంబంధిత అభ్యర్థికి కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పేర్కొంది.