పదోరోజు కొనసాగిన మున్సిపల్ కార్మికుల సమ్మె - పలుచోట్ల ఘర్షణలు Municipal Workers Strike Tenth Day: మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే కార్మిక వర్గమంతా ఐక్యమై జగన్‌ను ఇంటికి పంపడం ఖాయమని కార్మిక సంఘ నేతలు హెచ్చరించారు. విజయవాడ ధర్నాచౌక్‌లో పదో రోజు కార్మికుల సమ్మె కొనసాగింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో సచివాలయ ఉద్యోగులతో చెత్త తరలించేందుకు అధికారులు యత్నించగా పారిశుద్ధ్య కార్మికులు అడ్డుకున్నారు. మాకు ఇవ్వని గ్లౌజులు, మాస్కులు మీకు ఎక్కడి నుంచి వచ్చాయంటూ నిలదీశారు.
నందిగామలో సమ్మెకు మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మద్దతు తెలిపారు. 110 మంది కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో పోలీసులు, కార్మికులకు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రైవేటు వ్యక్తులతో అధికారులు పారిశుద్ధ్య పనులు చేయిస్తున్నారంటూ కార్మికులు ఆందోళనకు దిగారు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు బలవంతంగా కార్మికులను స్టేషన్‌కు తరలించారు.
మెడకు ఉరితాళ్లు, రోడ్లపై పడుకుని పారిశుద్ధ్య కార్మికుల నిరసన
బాపట్ల జిల్లా చీరాలలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో భిక్షాటన చేస్తూ ఆందోళన కొనసాగించారు. ఒంగోలు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట కార్మికులు పొర్లుదండాలు పెడుతూ సమస్యలు ఏకరవుపెట్టారు. ఆందోళనకు టీడీపీ నేత దామచర్ల జనార్దన్ మద్దతు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జగన్ ఇచ్చిన హామీలు అందని ద్రాక్షలా ఉన్నాయంటూ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ద్రాక్ష గుత్తులను దీక్షా శిబిరం వద్ద కట్టి నిరసన వ్యక్తం చేశారు.
అనంతపురం మేయర్ మహ్మద్ వసీం ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో చెత్తను తరలించేందుకు యత్నిస్తారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి పలు కాలనీల్లో చెత్త తరలించారని ఆరోపిస్తూ ట్రాక్టర్‌తో చెత్తను తీసుకొచ్చి కార్పొరేషన్ కార్యాలయం వద్ద పెద్ద కుప్పగా పోశారు. కళ్యాణదుర్గంలో పారిశుద్ధ్య సిబ్బంది ర్యాలీ నిర్వహించి భిక్షాటన చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించం - స్పష్టం చేసిన మున్సిపల్ కార్మికులు
రాయదుర్గంలో మున్సిపల్ ఔట్‌సోర్సింగ్, ఇంజినీరింగ్ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. తాడిపత్రిలో వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి, కార్మికులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కొంతమంది వైసీపీ నాయకులు, ప్రైవేటు వ్యక్తులతో కలసి ఎమ్మెల్యే పెద్దారెడ్డి చెత్త తరలించేందుకు యత్నించగా కార్మికులు అడ్డుకున్నారు. అయినప్పటికీ ఎమ్మెల్యే వైసీపీ నాయకులు వినకుండా బలవంతంగా చెత్త తరలించాలని చూడగా వాగ్వాదం జరిగింది.
సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో మున్సిపల్ కార్మికులు ఒంటినిండా ఆకులు కట్టుకుని, గడ్డి తింటూ నిరసన తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ అనేక హామీలిచ్చి, అధికారం చేపట్టాక వాటిని గాలికొదిలేశారని మండిపడ్డారు. ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ కడపలో కార్మికులు ప్రభుత్వ శవయాత్ర నిర్వహించారు. చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. నెల్లూరులో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు.
సమస్యలు పరిష్కరించండి లేకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తాం: పారిశుద్ధ్య కార్మికులు