ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పన్నెండో రోజూ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె - ఎన్ని ఆంక్షలు పెట్టినా ఉద్యమం ఆపేది లేదని స్పష్టం - మున్సిపల్‌ కార్మికులు

Municipal Workers Strike: సమస్యల పరిష్కారం కోసం పారిశుద్ధ్య కార్మికులు పన్నెండో రోజూ కదం తొక్కారు. కార్యాలయాల ముట్టడించి నిరసనలు, ధర్నాలతో హోరెత్తించారు. కార్మికుల సమ్మెను పలుచోట్ల పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. హక్కుల కోసం తాము చేస్తున్న పోరాటాన్ని ప్రభుత్వం అణచివేసేందుకు ప్రయత్నిస్తోందని కార్మికులు మండిపడ్డారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఆంక్షలు పెట్టినా డిమాండ్లు నెరవేర్చేవరకు ఉద్యమం ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు.

Municipal_Workers_Strike
Municipal_Workers_Strike

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 6, 2024, 5:11 PM IST

Municipal Workers Strike: అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక జగన్‌ మోసం చేశారంటూ గుంటూరు మున్సిపల్‌ కార్యాలయం ఎదుట కార్మికులు ఆందోళన చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ సర్కిల్‌-2 కార్యాలయం వద్ద కార్మికులు పెద్ద ఎత్తు ఆందోళన చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కార్మికులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది. ర్యాలీగా వెళ్లి మున్సిపల్‌ కార్యాలయం ముట్టడించేందుకు కార్మికులు యత్నించారు. కార్యాలయం లోనికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులను ఛేదించుకుని లోనికి వెళ్లిన నిరసనకారులు కార్యాలయం ముందు నిరసన తెలిపారు.

సీఎం జగన్‌ మనసు మర్చాలంటూ నెల్లూరులో బారాషాహీద్‌ దర్గాలో ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఒంగోలు మున్సిపల్‌ కార్యాలయం నుంచి చెత్త సేకరణ వాహనాలను బయటకు రానివ్వకుండా గేటు ఎదుట బైఠాయించారు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌ వాహనాన్ని అడ్డుకుని డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆందోళన కారులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
ఎమ్మెల్యే కేతిరెడ్డి, మున్సిపల్ కార్మికుల మధ్య వాగ్వాదం - తాడిపత్రిలో ఉద్రిక్తత

సమస్యల పరిష్కారం కోసం కడప నగర పాలక కార్యాలయాన్ని ముట్టడించిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులను ఛేదించుకుని కార్మికులు కార్యాలయం లోనికి దూసుకెళ్లారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాటలతో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. అన్నమయ్య జిల్లా రాజంపేటలో మున్సిపల్‌ కార్యాలయంలో లోనికి వెళ్లి అధికారులను రానివ్వకుండా అడ్డుకున్నారు. పోలీసులు నిరసనకారులను కార్యాలయం లోపలి నుంచి ఈడ్చుకుంటూ బయటకు లాక్కెళ్లారు. మహిళను కూడా విచక్షణ రహితంగా ఈడ్చుకురావడంతో కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కార్మికుల సమ్మె తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మున్సిపల్‌ కార్యాలయం లోనికి కార్మికులు వెళ్లి హామీలు నెరవేర్చాలంటూ నినాదాలతో హోరెత్తించారు. పోలీసులు కార్మికులను కార్యాలయం నుంచి ఈడ్చుకు రావడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో మున్సిపాలిటీ సిబ్బందిని బయటకు పంపించి కార్యాలయానికి తాళాలు వేసి ఆందోళన చేశారు. అనంతపురంలో కార్మికులు చేపట్టిన సమ్మె తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. నగర పాలక సంస్థ ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.
తొలగిస్తున్నామంటూ అధికారుల నోటీసులు-బెదిరింపులకు భయపడమంటూ, నోటీసులను తగులబెట్టిన మున్సిపల్ కార్మికులు

కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో నగర పంచాయతీ కార్యాలయం ఎదుట కంచాలను గరిటెలతో కొడుతూ నిరసన తెలిపారు. మరోవైపు కార్మికుల సమ్మె వల్ల వార్డుల్లో ఎక్కడికక్కడ చెత్త పేరుకపోయింది. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మున్సిపల్‌ కార్యాలయాన్ని ముట్టడించి ఉద్యోగులను విధులకు హాజరు కాకుండా అడ్డుకున్నారు. నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. దీంతో అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలంటూ కార్మికులు పోలీసు స్టేషన్‌ను ముట్టడించి నిరసన తెలిపారు.

విశాఖ జీవీఎంసీ గాంధీ పార్కు నుంచి మహా ప్రదర్శనకు పిలుపునివ్వడంతో కార్మికులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. పోలీసులు తమపై నిర్బంధకాండ ప్రదర్శించడం అన్యాయమంటూ కార్మికులు మండిపడ్డారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపల్‌ కార్యాలయ ముట్టడికి పిలునివ్వడంతో కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టు చేశారు. శ్రీకాకుళంలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన ధర్నా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. నగర పాలక కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. నిరసన కారులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. 79 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేసి ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

మున్సిపల్​ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె సైరన్ - ప్రభుత్వానికి హెచ్చరిక

ABOUT THE AUTHOR

...view details