ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మున్సిపల్‌ కార్మికులు ఆందోళనలు - ఉక్కుపాదం మోపిన పోలీసులు - protest for fair wages

Municipal workers protest: పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె 14 రోజూ నిరవధికంగా కొనసాగింది. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ కలెక్టరేట్ల వద్ద మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన ఆందోళనల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పలుచోట్ల నిరసనలు తెలుపుతున్న కార్మికులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు కార్మికుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హామీలు నెరవేర్చకపోగా పోలీసులతో ఇబ్బందులకు గురిచేస్తారా అంటూ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Municipal workers protest
Municipal workers protest

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 8, 2024, 9:34 PM IST

మున్సిపల్‌ కార్మికులు ఆందోళనలు - ఉక్కుపాదం మోపిన పోలీసులు

Municipal Workers Protest:డిమాండ్ల సాధన కోసం సమ్మె చేపట్టిన పారిశుద్ధ్య కార్మికులు ప్రభుత్వ అణచివేత ధోరణిని నిరసిస్తూ ఉద్యమం ఉద్ధృతంగా కొనసాగిస్తున్నారు. కలెక్టరేట్ల ముట్టడికి యత్నించిన కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పారిశుద్ధ్య కార్మికులు 14 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తుండటంతో ప్రకాశం జిల్లా కనిగిరిలో ఎక్కడికక్కడ వ్యర్థాలు రోడ్లపై గుట్టలుగా పేరుకుపోయాయి.

హామీలు నెరవేర్చాలంటూ రోడ్డెక్కిన మున్సిపల్‌ కార్మికులు, సడలని సంకల్పంతో సమ్మెను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా కలెక్టరేట్ల వద్ద నినాదాలు చేశారు. పలుచోట్ల కలెక్టరేట్ల ముట్టడికి యత్నించిన కార్మికులను పోలీసులు అడ్డుకోవడం, తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సమస్యల పరిష్కారం కోసం చలో కలెక్టరేట్‌ చేపట్టిన ఎన్టీఆర్ జిల్లా మున్సిపల్ కార్మికులపై, విజయవాడ పోలీసులు ఉక్కుపాదం మోపారు. కలెక్టరేట్‌ ముట్టడికి యత్నించిన వారిని ఈడ్చుకెళ్లి వాహనాల్లో పడేశారు. మహిళలు, పెద్ద వయసువారనే కనికరం లేకుండా, ఇష్టారాజ్యంగా లాక్కెళ్లారు. కార్మికులు, పోలీసుల మధ్య తోపులాటలో పలువురు కార్మికులు గాయపడ్డారు. ఈ క్రమంలో ఓ మహిళ స్పృహతప్పి పడిపోయారు. కాసేపు ఆమె చలనం లేకుండా ఉండిపోవడంతో, కార్మికులంతా తీవ్ర ఆందోళన చెందారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. పోలీసుల చర్యల పట్ల మండిపడ్డ కార్మికులు ఇచ్చిన హామీలను జగన్‌ నెరవేర్చేవరకూ పోరాటం ఆపబోమని తెగేసి చెప్పారు. హామీలు నెరవేర్చకపోగా పోలీసులతో కొట్టిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మున్సిపల్​ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అసోసియేషన్​ ఏర్పాటు: బొప్పరాజు

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. బెదిరింపులకు పాల్పడి, ఇతరులతో పారిశుద్ధ్య పనులు చేయిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో.. కలెక్టరేట్‌ వద్ద మున్సిపల్ కార్మికులు రోడ్డుపై బైఠాయించి, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. నెల్లూరులో వీఆర్సీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించిన కార్మికులు, సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టిన కార్మికులు ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. పారిశుద్ధ్య కార్మికులు 14 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తుండటంతో ప్రకాశం జిల్లా కనిగిరిలో ఎక్కడికక్కడ వ్యర్థాలు రోడ్లపై గుట్టలుగా పేరుకుపోయాయి. భరించలేని దుర్గంధంతో స్థానికులు రోడ్లపైకి రావాలంటే హడలెత్తుతున్నారు.

సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించం - స్పష్టం చేసిన మున్సిపల్‌ కార్మికులు

గుంటూరు నగరపాలక సంస్థ నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్న కార్మికులు, గేటు వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. తెలుగుదేశం, జనసేన నాయకులు సంఘీభావం తెలిపారు. ఏలూరులో మున్సిపల్ కార్మికులు, జూట్‌ మిల్లు నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ చేపట్టారు. కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు. విశాఖలో జీవీఎంసీ గాంధీ పార్క్‌వద్ద, శిరోముండనం కార్యక్రమం చేపట్టి కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. విజయనగరం కలెక్టరేట్‌ను ముట్టడించి... కార్మికుల చేతుల ఆకారంలో ఉన్న ప్లకార్డులు ధరించి డిమాండ్లను ప్రదర్శించారు.
మున్సిపల్‌ కార్మికులపై పోలీసుల ఉక్కుపాదం - ఈడ్చుకెళ్లిన వైనం, స్పృహతప్పి పడిపోయిన మహిళ

ABOUT THE AUTHOR

...view details