రేపల్లె పురపాలక సంఘం 1956లో 16 వార్డులతో ఏర్పాటైంది. 1967లో 20 వార్డులు, 1987కి 24 వార్డులు, 2005లో 28 వార్డులుగా విస్తరించింది. ప్రస్తుతం 28 వార్డులున్నాయి. మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ నాలుగు సార్లు, తెదేపా మూడుసార్లు, పీఠాన్ని దక్కించుకున్నాయి. అయినా.. ఇప్పటి వరకు పట్టణం ఆశించిన అభివృద్ధికి నోచుకోలేదు. రేపల్లెలోని పలు వార్డుల్లో ప్రజలు ఇప్పటికి తాగునీరు, డ్రైనేజీ సమస్యలు ఎదుర్కొంటున్నారు.
ఇప్పుడు జరుగుతున్న పురపాలక ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. జనసేన-భాజపా కూటమి అభ్యర్థులూ పోటీలో ఉన్నారు. ఇక్కడ కొన్ని వార్డుల్లో త్రిముఖ పోరు నెలకొంది. పట్టణంలో మొత్తం 55వేల 190 మంది జనాభా ఉండగా... 36 వేల 806 మంది ఓటర్లు ఉన్నారు. మహిళా ఓటర్లు అధికంగా ఉండటం విశేషం. పురుషులు 17వేల 432 కాగా... మహిళలు 19వేల 356 మంది, ఇతరులు 19 మంది ఉన్నారు.
పురపోరులో మొత్తం 124 మంది నామినేషన్లు వేయగా... 46మంది ఉపసంహరించుకున్నారు. 28 వార్డుల్లో 1, 2, 8, 12 వార్డులు వైకాపాకు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 24 వార్డుల్లో పోలింగ్ జరగనుంది. వైకాపా 24, తెదేపా 23, జనసేన 4, భాజపా 3, ఇతరులు 15 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఎలాగైనా పుర పీఠాన్ని దక్కించుకోవాలని ప్రధాన పార్టీల నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. పోలింగ్ దగ్గర పడుతున్న కారణంగా అభ్యర్థులతో కలిసి జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎవరికి వారు విజయం తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పట్నం పోరు: రేపల్లె పురపీఠం ఎవరిది..? తమ పార్టీ (వైకాపా) అభ్యర్థులను గెలిపించాలంటూ... మాజీమంత్రి, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ ప్రచారం చేస్తున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ... ప్రచారం నిర్వహిస్తున్నారు. రేపల్లె పట్టణాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడమే ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్తున్నట్లు మోపిదేవి తెలిపారు. తెదేపా చరిత్ర ముగిసిందని... ప్రజలు వైకాపాను ఆదరిస్తున్నారని చెబుతున్నారు.
పట్నం పోరు: రేపల్లె పురపీఠం ఎవరిది..? తెదేపా శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతూ... ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తున్నారు. తెదేపాకు ప్రజల ఆదరణ ఉందని... తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మోసపూరిత హామీలతో వైకాపా అధికారంలోకి వచ్చిందని అనగాని విమర్శిస్తున్నారు. భయభ్రాంతులకు గురిచేసి ఏకగ్రీవాలకు అధికార పార్టీ తెర లేపిందని ఆరోపించారు.
పురపోరులో రెండు ప్రధాన పార్టీల మధ్య పోటాపోటీ నెలకొంది. తమను గెలిపిస్తే పట్టణంలోని సమస్యలు పరిష్కారిస్తామనే హామీలతో ప్రచారం నిర్వహిస్తున్నారు. తటస్థ ఓటర్లపై నాయకులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. గెలిచేందుకు ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా వ్యుహరచనలు చేస్తున్నారు. చూడాలి మరి... రేపల్లె పురపీఠంపై ఎవరు జెండా ఎగరేస్తారో..!
ఇదీ చదవండీ... అమరావతిని కాపాడుకునే బాధ్యత మీకు లేదా?: చంద్రబాబు