ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అన్న క్యాంటీన్‌ ఏర్పాట్లను అడ్డుకున్న అధికారులు.. మంగళగిరిలో ఉద్రిక్తత - గుంటూరు జిల్లా తాజా వార్తలు

anna canteen
anna canteen

By

Published : Jun 9, 2022, 7:06 PM IST

Updated : Jun 10, 2022, 7:05 AM IST

19:03 June 09

మంగళగిరి బస్టాండ్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత

Tension at Mangalagiri: గుంటూరు జిల్లా మంగళగిరిలో పేదలకు రూ.2కే భోజనం పెట్టేందుకు తెదేపా నాయకులు ఏర్పాటు చేస్తున్న అన్న క్యాంటీన్‌ను నగరపాలకసంస్థ అధికారులు గురువారం ధ్వంసం చేశారు. కొత్త బస్టాండ్‌ సమీపంలోని ఎన్టీఆర్‌, డాక్టర్‌ ఎం.ఎస్‌.ఎస్‌.కోటేశ్వరరావుల విగ్రహాల వద్ద తెదేపా నాయకులు క్యాంటీన్‌కు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈనెల 10న సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని దీనిని ఏర్పాటు చేస్తున్నామని నాయకులు చెప్పారు.

ఇక్కడే వేసవి చలివేంద్రం ఏర్పాటు చేసి కొన్ని నెలలుగా ఉచితంగా మజ్జిగ, తాగునీరు సరఫరా చేస్తున్నారు. గతంలో ఉన్న ప్లాట్‌ఫారంపైనే క్యాంటీన్‌ ఏర్పాటు చేస్తుండగా అనుమతి లేదంటూ నగరపాలక సంస్థ అధికారులు వచ్చి ఏర్పాట్లను తొలగించారు. తాము కొత్త నిర్మాణం ఏమీ చేయడంలేదని, చెప్పినా వినకుండా అధికారులు వాటిని తొలగించారని నాయకులు ఆరోపించారు. మళ్లీ తిరిగి క్యాంటీన్‌ ఏర్పాటు చేసుకోగా చీకటి పడిన తర్వాత భారీ సంఖ్యలో పోలీసులు, అధికారులు వచ్చి పొక్లెయిన్‌తో నిర్మాణాన్ని ధ్వంసం చేశారు. తెదేపా నాయకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని అన్న క్యాంటీన్‌ను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

పేదలకు అన్న క్యాంటీన్‌ ద్వారా భోజనం పెట్టడం తప్పా అంటూ తెదేపా నాయకులు అధికారులను నిలదీశారు. ఈ క్రమంలో ఆందోళనకు దిగిన గుంటూరు పార్లమెంటు తెదేపా ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావుతో పాటు నాయకులను డీఎస్పీ జె.రాంబాబు ఆధ్వర్యంలో అదనపు బలగాల సాయంతో అరెస్టు చేసి పెదకాకాని, తాడేపల్లి పోలీసు స్టేషన్లకు తరలించారు. అరెస్టులను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున కార్యకర్తలు నిరసనకు దిగారు. పేదలకు భోజనం పెట్టనివ్వకుండా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అడ్డుకుంటున్నారని నాయకులు విమర్శించారు.

తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆందోళన..ఎస్సీ మహిళ అని కూడా చూడకుండా పోలీసులు కొట్టారని తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి కంభంపాటి శిరీష ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలో అన్న క్యాంటీన్‌ ఏర్పాట్ల ధ్వంసానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన శిరీషతోపాటు మరో మహిళను పోలీసులు తాడేపల్లి స్టేషన్‌కు తీసుకొచ్చారు. దీంతో తెదేపా కార్యకర్తలు స్టేషన్‌ వద్దకు వచ్చి ఆమెకు మద్దతుగా నిలిచారు. పోలీసులు, ఎమ్మెల్యే, సీఎంలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

శిరీష పోలీసు వ్యాన్‌ దిగడానికి నిరాకరించి తనను ఎందుకు అదుపులోకి తీసుకున్నారు.. ఎందుకు కొట్టాల్సి వచ్చిందో చెప్పాలని పోలీసులను నిలదీశారు. దీంతో 41వ నోటీసు ఇచ్చి పంపుతామని పోలీసులు వివరించగా.. అదుపులోకి తీసుకున్న చోటే ఎందుకు నోటీసు ఇవ్వలేదని ప్రశ్నించారు. కొంతసేపు వారి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఆమె పోలీసు వ్యాన్‌ దిగి స్టేషన్‌లోకి వెళ్లారు. ఆందోళనలో తాడేపల్లి పట్టణ తెలుగుదేశం అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 10, 2022, 7:05 AM IST

ABOUT THE AUTHOR

...view details