గుంటూరు జిల్లాలో పారిశ్రామిక ప్రాంతమైన చిలకలూరిపేట పురపాలక సంఘంలో స్థానిక ఎన్నికల కళ తప్పింది. జిల్లా నగర పాలక సంస్థతో పాటు మరో ఏడు పురపాలక సంఘాల ఎన్నికల ప్రక్రియ ఆగిన చోట నుంచే కొనసాగించేందుకు ఎస్‌ఈసీ పచ్చజెండా ఊపింది. అయితే ఇక్కడ మాత్రం అధికారుల హడావుడి ఒక్కటే కనిపిస్తోంది. నామపత్రాలు దాఖలు చేసిన ప్రధాన పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఇంతవరకు గడప దాటలేదు. ప్రచారం చేసేందుకు ఆసక్తి చూపకపోవడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.
పురపాలక ఎన్నికలకు గతేడాది షెడ్యూలు జారీ చేశారు. దీంతో అధికార వైకాపా, ప్రతిపక్ష తెదేపా, ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. వాటి పరిశీలన అనంతరం కరోనా కారణంతో ఎస్‌ఈసీ ఎన్నికలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇక్కడే అసలు మెలిక పడింది. ఆ తర్వాత పంచాయతీల విలీన వ్యవహారం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి చేరడంతో ప్రక్రియపై స్టే విధించింది. అయితే ఎన్నికలకు సంబంధించిన అంశం అప్పట్లో న్యాయస్థానం దృష్టికి వెళ్లలేదు.
పురపాలక, పంచాయతీ అధికారులకు మాత్రమే న్యాయస్థాన ఉత్తర్వులు చేరాయి. దీనిపై అధికారులు కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. చిలకలూరిపేట పురపాలక సంఘంలో గణపవరం, పసుమర్రు మేజరు పంచాయతీలతో పాటు మానుకొండవారిపాలెం పంచాయతీలను ప్రభుత్వం విలీనం చేసింది. అయితే రెండు గ్రామాల్లో ఆశించిన అభివృద్ధి, ప్రజలకు ఉపాధి లేకపోవడం వంటి కారణాలతో విలీన ప్రక్రియపై ఇద్దరు న్యాయవాదులు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
గ్రామ సభ తీర్మానం లేకుండా ఎమ్మెల్యే సిఫార్సుతో విలీన ప్రక్రియ నిర్వహించారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వం ఇచ్చిన విలీన ఉత్తర్వులపై న్యాయస్థానం స్టే విధించింది. విలీన సమయంలో పంచాయతీ దస్త్రాలు పురపాలక సంఘానికి చేరాయి. ఆ తర్వాత పది రోజుల్లోనే ఇవి పంచాయతీలకు తిరిగొచ్చాయి. ప్రస్తుతం గణపవరం, పసుమర్రులో పంచాయతీ పాలన కొనసాగిస్తున్నారు.
పంచాయతీ అధికారులే పన్ను వసూలు
ఉపాధి హామీ పథకం, పంచాయతీ నిధులతో అంతర్గత సీసీ రోడ్లు, పలు అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఇంటి పన్నులను కూడా పంచాయతీ అధికారులే వసూలు చేస్తున్నారు. సచివాలయం, వాలంటీర్లు, పింఛన్లు పంపిణీ, డ్వాక్రా, విద్య, వైద్యం వంటి వ్యవస్థలు కూడా పంచాయతీ పరిధిలోనే ఉన్నాయి. న్యాయస్థానం స్టే అమల్లో ఉందన్న కారణంగా గత పంచాయతీ ఎన్నికలు కూడా ఇక్కడ నిర్వహించలేదు. అయితే తిరిగి పురపాలక ఎన్నిక ప్రక్రియను చేపట్టడంతో ప్రజల్లోనూ గందరగోళ పరిస్థితికి దారితీసింది. పురపాలక ఎన్నికల షెడ్యూలు జారీకి ముందే విలీనం చేసుకున్న ఈ పంచాయతీల్లో పురపాలక వార్డుల విభజన, వాటికి రిజర్వేషన్లు ఖరారు చేశారు.