ఈ బాడీ బిల్డర్‌కు సాయం చేస్తారా! గుంటూరు గ్రామీణ మండలం ఏటుకూరు గ్రామంలో పుట్టి దేహదారుఢ్య పోటీల్లో అంతర్జాతీయంగా ప్రతిభ కనబరుస్తున్న తెలుగుబిడ్డ నిశ్శంకరరావు రవికుమార్. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచాడు. జాతీయస్థాయిలో బంగారు పతకం సాధించాడు. గతేడాది జరిగిన ఏషియన్ బాడీ బిల్డింగ్ పోటీల్లో కాంస్య పతకం సాధించిన రవికుమార్... ఈ ఏడాది బంగారు పతకం కోసం కఠోర సాధన చేశాడు. ఈ నెల 3న ఇండోనేషియాలో జరిగిన పోటీల్లో మొదటి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ పొందాడు.
ఆర్నాల్డ్ స్కార్జ్ లా కావాలనీ..!
ఇంటర్ చదివే రోజుల్లో టీవిలో రవికుమార్ ఓ హాలీవుడ్ సినిమా చూశాడు. అందులో ఆర్నాల్డ్ స్క్వార్జ్ నెగ్గర్ విన్యాసాలు రవికుమార్‌కు ఎంతగానో నచ్చాయి. ఆయన గురించి తెలుసుకున్నాడు. ఒకప్పుడు ట్రక్ డ్రైవర్‌గా ఉన్న ఆర్నాల్డ్ ఆ తర్వాత ప్రొఫెషనల్ బాడీ బిల్డర్‌గా ఎదిగిన విషయం రవికుమార్‌ను ఆకట్టుకుంది. ఆ తర్వాత సినిమాల్లో నటించటం, రాజకీయాల్లోకి ప్రవేశించటం ఇవన్నీ రవికుమార్‌లో స్ఫూర్తి రగిలించాయి.
తాను కూడా ఆర్నాల్డ్ మాదిరిగా తయారు కావాలని నిర్ణయించుకున్నాడు. జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేయటం ప్రారంభించాడు. బాడీ బిల్డర్‌గా ఎదిగేందుకు ప్రత్యేక ప్రణాళికతో వ్యాయామాలు చేశాడు. ప్రతిరోజూ 8గంటల పాటు జిమ్‌లో సాధన చేస్తున్నాడు. నిపుణులు సూచించిన విధంగా ఆహారం తీసుకుంటాడు.
కుటుంబ పరిస్థితి అంతంత మాత్రమే..!
రవికుమార్ ఈ స్థాయికి వచ్చేందుకు ఎన్నో కష్టాలు పడ్డాడు. క్రీడా సంస్థలు, ప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ ఎలాంటి ప్రోత్సాహం లేదు. ఆసియా స్థాయిలో 36 దేశాలతో పోటీపడి బంగారు పతకం తెస్తే పట్టించుకున్నవారు లేరు. అతని తండ్రి లారీ డ్రైవర్. తల్లి చిన్న టిఫిన్ సెంటర్ నడుపుతోంది. కుటుంబానికి వేరే ఆదాయ మార్గాలు లేవు. రవికుమార్ సాధన కోసం ఇద్దరు జిమ్ యజమానులు ఉచితంగానే అవకాశం కల్పించారు. రవి తీసుకునే ఆహారం కోసం రోజూ 15 వందల రూపాయల వరకూ ఖర్చవుతుంది. ఇంటివద్ద పరిస్థితి అంతంతమాత్రం కావటంతో ఎక్కువగా స్నేహితులపై ఆధారపడతాడు. మరీ ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు అనిపిస్తే...తన తల్లి బంగారం కుదవపెట్టి డబ్బు తెచ్చిచ్చిన సందర్భాలు ఉన్నాయని రవికుమార్ చెబుతున్నాడు.
ప్రపంచ పోటీలకు ఎంపిక!
వచ్చే నెలలో దక్షిణ కొరియాలో జరిగే ప్రపంచ బాడీ బిల్డింగ్ పోటీలకు రవికుమార్ ఎంపికయ్యాడు. అయితే వెళ్లి వచ్చేందుకు అన్ని రకాల ఖర్చులు ఐదారు లక్షల వరకు అవసరం. దానికి స్పాన్సర్లు లేకపోవటంతో పోటీలకు వెళ్లాలా? వద్దా? అనే ఆలోచనలో ఉన్నాడు. దేహదారుఢ్య పోటీల్లో ఏపీ నుంచి ఎప్పుడో 1970లో జనార్దన్ మాత్రమే బంగారు పతకం సాధించాడు. ఆ తర్వాత ఎవరూ ఎలాంటి పతకం సాధించలేదు.
ఇదీ చదవండి:ఈశ్వర్ మారూరి.. మన ఐరన్ మ్యాన్ 'ఈత'డు!