ఎంపీ రఘురామకృష్ణరాజు కేసులో హైడ్రామా కొనసాగుతోంది. భారీ బందోబస్తు భద్రతల నడుమ ఆయనను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. జీజీహెచ్ క్యాన్సర్ ఆసుపత్రిలో ఉన్న ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రఘురామకృష్ణరాజు గాయాలపై నివేదికను మెడికల్ బోర్డు జిల్లా కోర్టుకు ఇచ్చింది. అక్కడి నుంచి జస్టిస్ ప్రవీణ్ కుమార్ నివాసానికి ప్రత్యేక మెసెంజర్ ద్వారా నివేదికను జిల్లా కోర్టు పంపింది. హైకోర్టులో రఘురామ కేసుపై వాదనలు జరిగాయి. ఈ నివేదికలో ఉన్న అంశాలపైనే.. అందరి దృష్టి కేంద్రీకృతమైంది. మరోవైపు రఘురామను జైలుకు తరలించడంపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
భారీ బందోబస్తు నడుమ..
ఎంపీ రఘురామకృష్ణరాజును గుంటూరు జీజీహెచ్ వెనక గేటు నుంచి తీసుకెళ్లారు. అక్కడి నుంచి జిల్లా జైలుకు తరలించారు. నిన్న 14 రోజుల రిమాండ్ విధించడంతో పాటు.. రఘురామను జీజీహెచ్, రమేష్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని.. రిపోర్టులు తమకు అందజేయాలని కోర్టు ఆదేశించింది. రాత్రంతా జీజీహెచ్ లో రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. తర్వాత రమేష్ ఆసుపత్రిలో చేరుస్తారని భావించారు. అయితే ఒక్కసారిగా పోలీసులు ఎంపీని జిల్లా జైలుకు తరలించడంతో రఘురామ బంధువులు, అభిమానులు ఆందోళన చెందారు. ఆయన్ను జైలుకు చేర్చడంలో అడ్డంకులు లేకుండా ఉండేందుకు గుంటూరు జిల్లా కారాగారం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. గట్టి బందోబస్తు నిర్వహించారు.