ఎన్నికలు బహిష్కరిస్తున్నామని చంద్రబాబు చెప్పినప్పుడే.. రాష్ట్రంలో తెదేపా పని అయిపోయిందని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ ఘాటుగా వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా రేపల్లెలోని వైకాపా కార్యాలయంలో మోపిదేవి మీడియా సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో ఆఖరి అధ్యాయానికి తెరలేచిందని ఎంపీ పేర్కొన్నారు. పుర, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారని.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సమర్థవంతంగా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన తెదేపా... ఎన్నికల్లో పోటీ చేయమని తమ అసమర్థతను ఒప్పుకుందన్నారు.
రాష్ట్రంలో తెదేపా పని అయిపోయింది: మోపిదేవి
రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ తెదేపాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తెదేపా పని అయిపోయిందని పేర్కొన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ ప్రజలు తమకు పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా రేపల్లెలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఎన్నికలు నిర్వహించాలని కోర్టు తీర్పు ఇస్తే చంద్రబాబు ఎన్నికలు ఆపమనడం సరికాదని మోపిదేవి వ్యాఖ్యానించారు. కోర్టు నిర్ణయాలను తెదేపా నేతలు తప్పు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఎదుర్కొనే నైజం చంద్రబాబుకు లేదని ఎంపీ విమర్శించారు. ఓటమి పాలవుతారని ముందే తెలిసి... రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన ఎన్నికలను ఆపేందుకు చూస్తున్నారని ఆరోపించారు. తిరుపతి ఉప ఎన్నికలో తెదేపాకు డిపాజిట్లు దక్కవన్నారు. పోరాడటం చేతకాక ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని రబ్బర్ స్టాంప్ అంటు కించపరచడం బాధాకరమని మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండీ... బైపోల్: గెలుపే లక్ష్యంగా సర్వశక్తులూ ఒడ్డుతున్న పార్టీలు