తమ మనుగడ కాపాడుకునేందుకు తెదేపా నేతలు చిల్లర రాజకీయాలకు తెర లేపుతున్నారని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. గుంటూరు జిల్లా రేపల్లె రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో అర్హులైన అభ్యర్థులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన ఆయన..రాష్ట్రంలో పారదర్శక పాలన కొనసాగుతుందన్నారు. పరిపాలన, సంక్షేమ పథకాల అమలులో వైకాపా ప్రభుత్వం..యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ప్రశాంత వాతావరణం ఉన్న రాష్ట్రంలో తెదేపా నేతలు మత కలహాలు సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు.
దేవాలయాలపై జరిగిన దాడుల్లో తెదేపాకు చెందినవారు ఉన్నారని ఇంటెలిజెన్స్ దర్యాప్తులో నిర్ధరణ అయ్యిందన్నారు. కూల్చడం తెదేపా సంస్కృతి అని..నిర్మించడం వైకాపా సంస్కృతి అని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం ప్రజలను ఓటు బ్యాంకుగా వాడుకుందని ఆరోపించారు. ప్రతిపక్షాలు అడిగే ఏ ప్రశ్నకైనా..ప్రజల ముందే జవాబు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.