ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సుల అమలులో భాగంగానే నూతన వ్యవసాయ చట్టాలు రూపొందించినట్లు రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తు వ్యవసాయ చట్టాలపై చర్చ కంటే రచ్చ ఎక్కువగా జరుగుతోందన్నారు. గుంటూరులోని భారతీయ మజ్దూర్ సంఘ్ హాల్లో నిర్వహించిన నూతన వ్యవసాయ చట్టాలపై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
నూతన వ్యవసాయ చట్టాలతో కనీస మద్దతు ధర దక్కదని ప్రతిపక్ష నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని జీవీఎల్ మండిపడ్డారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. నూతన వ్యవసాయ చట్టాలు మార్కెట్ యార్డులపై ఎలాంటి ప్రభావం చూపించవని..,రైతులు తమ పంటను ఎక్కడైనా విక్రయించుకునే వెసులుబాటు కొత్త చట్టాలతో కలిగిందని వివరించారు. ప్రస్తుతం చాలా చోట్ల రైతులను ఏదో ఒక విధంగా దోచుకోవడానికే మార్కెట్ యార్డులు ఉపయోగిస్తున్నారని అభిప్రాయపడ్డారు. రైతులను మోసం చేయడానికే కాంగ్రెస్, వామపక్షాలు వ్యవసాయ చట్టాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని జీవీఎల్ విమర్శించారు. వైకాపా, తెదేపా పార్టీలు పార్లమెంటులో వ్యవసాయ చట్టాలను సమర్థించి.. ఏపీలో చట్టాలకు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొంటున్నాయని ఆక్షేపించారు. వ్యవసాయ చట్టాలు తెచ్చే ముందే కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చిందని..అప్పుడు కాంగ్రెస్, ఇతర విపక్షాలు నిద్రపోయాయా ? అని ప్రశ్నించారు.