ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యార్థులనూ వదలని వైసీపీ - రూట్​ మార్చి సభలకు - సీఎం సభల్లో ప్రజల అవస్థలు న్యూస్

Moving Students for CM Jagan Meetings: విద్యారంగ సమస్యలపై విద్యార్థి లోకం కదం తొక్కడం తెలిసిందే. కానీ, ప్రభుత్వానికి మద్దతుగా, పార్టీకి జై కొట్టించడానికి కూడా విద్యార్థులను వాడుకోవడం ఏపీలో మాత్రమే కనిపిస్తోంది. విద్యార్థులతో వైసీపీ జెండాలు పట్టించడం, సీఎం జగన్​కు జై కొట్టించడం దారితప్పిన పరిస్థితికి దర్పణం పడుతోంది.

Moving_Students_for_CM_Jagan_Meetings
Moving_Students_for_CM_Jagan_Meetings

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 13, 2023, 7:45 PM IST

Moving Students for CM Jagan Meetings: రాజకీయ సభలు, సమావేశాలకు సామాన్య జనాన్ని తరలించడం సర్వ సాధారణం. కానీ, జనం రాక సభలు వెలవెలబోతున్న నేపథ్యంలో వైసీపీ నేతలు ఉద్యోగులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులను బలవంతంగా తరలిస్తున్నారు. ముఖ్యమంత్రి సభ ఉందంటే చాలు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందుతున్నాయి.

పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించి విద్యార్థులను సైతం సభలకు భారీగా తరలిస్తున్నారు. అంతటితో ఆగకుండా ఇటీవల తిరుపతిలో సీఎం జగన్ సభకు విద్యార్థులను తరలించేందుకు ఏకంగా పరీక్షలనే రద్దు చేశారు. కొన్ని ఇంజనీరింగ్ కళాశాలల్లో సెమిస్టర్ పరీక్షలను అక్రమంగా రద్దు చేశారు. పరీక్షల కోసం కళాశాల బస్సులు ఎక్కిన విద్యార్థులకు చెప్పకుండానే రూటు మార్చి సీఎం సభ కోసంతరలించారు.

పాఠశాలలు, కళాశాలలో ఉండాల్సిన విద్యార్థులు ఎలాంటి భద్రత లేకుంటా వీధుల్లోకి రావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో నూజివీడులో జగనన్న విద్యాదీవెన విడుదల కార్యక్రమానికి 61 బస్సుల్లో దాదాపు 3వేల మంది ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులను తరలించడం పెద్ద ఎత్తున విమర్శలకు దారి తీసింది. ఎలాంటి భద్రత కల్పించకుండా విద్యార్థినులను సైతం తరలించడంపై విద్యార్థి, ప్రజా సంఘాలు మండిపడ్డాయి.

విద్యార్థులను కలుసుకునేందుకు తల్లిదండ్రులకు ఆదివారం ఒక్కరోజే అవకాశం ఉండగా బలవంతంగా జగన్‌ సభకు తరలించడంతో విద్యార్థులు అసహనానికి గురయ్యారు. ప్రయాణంలోనూ తీవ్ర అసౌకర్యానికి గురైన ఎంతోమంది విద్యార్థినులు వాంతులు చేసుకోవడం కనిపించింది.

హైకోర్టు తీర్పును ఉల్లంఘించి
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో సీఎం జగన్‌ సభకు పాఠశాల విద్యార్థులను తరలించడంపై హైకోర్టు నోటీసులు ఇచ్చింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్‌కుమార్‌ గుప్తాకు గతంలో నోటీసులు జారీ చేసింది. గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవం మినహా ఇతర ఏ ప్రభుత్వ కార్యక్రమాలకు పాఠశాల, కళాశాలల విద్యార్థులను బలవంతంగా తీసుకెళ్లవద్దని గతంలో ఇచ్చిన తీర్పును గుర్తు చేసింది. విద్యార్థులతో నినాదాలు చేయించడం కోర్టు ఆదేశాలను ధిక్కరించడమేనని అసహనం వ్యక్తం చేసింది.

తాజాగా మంగళవారం వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో విద్యార్థులతో నిర్వహించిన ర్యాలీ సైతం విమర్శలకు దారి తీసింది. 'విద్యార్థి సాధికారత జగనన్నతోనే సాధ్యం' అంటూ స్టూడెంట్స్​తో ర్యాలీ చేపట్టడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాలల్లో తరగతులు జరుగుతున్న సమయంలో విద్యార్థులను బలవంతంగా ర్యాలీకి తీసుకురావడాన్ని తీవ్రస్థాయిలో ఖండించారు.

విద్యారంగానికి సంబంధించి ప్రభుత్వం ఏదైనా వ్యతిరేక నిర్ణయం తీసుకుంటే విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగడం సహజమే. కానీ, అందుకు విరుద్ధంగా ప్రభుత్వానికి, సీఎం జగన్​కు జై కొట్టించడానికి వీధుల్లోకి రప్పించడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

ఎదురు చెప్పలేని స్థితిలో యాజమాన్యాలు
అధికార పార్టీ నాయకులు తమ అవసరాల కోసం విద్యాసంస్థలను ఇష్టం వచ్చినట్లుగా వినియోగించుకుంటున్నారు. చందాల దందాలు మొదలుకుని సీఎం సభలకు బస్సులను వాడుకుంటున్నారు. ఇక విద్యార్థులను సభలకు తరలించడానికి వెనుకాడక పోవడం గమనార్హం. ఈ విషయమై విద్యాసంస్థల యజమానులు ఎదురుచెప్పేందుకు సాహసించడం లేదు.

ABOUT THE AUTHOR

...view details