హైదరాబాద్‌లో ట్రాఫిక్ వలన వస్తున్న సమస్యలు Traffic problems in Hyderabad: భాగ్యనగరంలో వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది. రోజు రోజుకు వాహనాల వినియోగం ఎక్కువవుతోంది. కొవిడ్ తర్వాత వ్యక్తిగత వాహనాలపైనే ఎక్కువ మంది ఆధారపడుతున్నారు. దీంతో రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. కిలోమీటరు ప్రయాణానికి కొన్ని సందర్భాల్లో 15 నిమిషాల సమయం పడుతోంది. వీవీఐపీల పర్యటన సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు తరచూ వాహనాలను నిలిపేస్తున్నారు. దీనివల్ల వాహనదారులు నిమిషాల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.
సమస్య తగ్గించేందుకు రోప్ కార్యక్రమం: వాహనాల రద్దీని తగ్గించేందుకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రత్యేక విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. రోప్ పేరుతో అమలు చేస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా వాహనదారులు, వీధి వ్యాపారులు, వ్యాపార వాణిజ్య భవనాల యజమానులు పక్కాగా ట్రాఫిక్ నియమాలను పాటించాల్సి ఉంది. ఇప్పటికే ఉన్న నిబంధనలను రోప్ కార్యక్రమం పేరుతో పక్కాగా అమలు చేస్తున్నారు.
నిబంధనలు జారీ చేసిన ఆశించిన ఫలితాలు రాలేదు: ఇందులో భాగంగా వాహనదారులు కూడళ్ల వద్ద సిగ్నళ్లు పడినప్పుడు స్టాప్ లైన్ దాటి ముందుకు వెళ్లకూడదు. ఫ్రీలెఫ్ట్ బోర్డులు ఏర్పాటు చేసిన చోట వాహనాలు అడ్డంగా పెట్టకూడదని ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు అవగాహన కల్పించారు. వీధి వ్యాపారులు రహదారులపైకి రావొద్దని పోలీసులు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వాళ్లపైన జరిమానాలు విధిస్తున్నా ఆశించిన మార్పు రావడం లేదు.
ఏ ఏ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఏక్కువగా ఉంది?:నగరంలోని కొన్ని ప్రాంతాల్లో అయితే వాహనాల రద్దీ మరీ ఎక్కువగా ఉంది. కూడళ్ల వద్ద సిగ్నళ్లను దాటి వెళ్లడానికి ఎదురు చూడాల్సి వస్తోంది. మలక్ పేట్, ఛాదర్ ఘాట్, కోఠి, అబిడ్స్, లక్డీకాపూల్, పంజాగుట్ట, అమీర్ పేట్, ఎర్రగడ్డ, కూకట్ పల్లి, మియాపూర్ చౌరస్తా, మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం, గుడిమల్కాపూర్, అత్తాపూర్, నానల్ నగర్, ఉప్పల్, నాగార్జున సర్కిల్, కేబీఆర్ పార్కు, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, ఫిలింనగర్లో ప్రయాణం అంటే భయపడాల్సి వస్తోంది. దిల్ సుఖ్ నగర్ చౌరస్తా, మెహదీపట్నం బస్టాప్‌ల వద్ద పాదచారులు రహదారి దాటే క్రమంలో ట్రాఫిక్‌ను నిలిపేయాల్సి వస్తోంది.
పాదచారుల వలన మరింత పెరుగుతున్న సమస్య: ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణ లేకపోవడంతో మెహదీపట్నం వద్ద వాహనాలు దాదాపు కిలోమీటర్ మేర బారులు తీరుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు పాదచారులు రోడ్డు దాటేందుకు కొంత సమయం కేటాయించి ఆ తర్వాత వాహనాలు వెళ్లేందుకు సిగ్నళ్లు వేయాల్సి ఉంటుంది. అలా కాకుండా పాదచారులు మధ్యమధ్యలో రోడ్డు దాటుతున్నారు. దీని వల్ల వాహనాలు అక్కడే నిలిచిపోతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు అక్కడే ఉన్నా పాదచారుల రాకపోకలను నియంత్రించకుండా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులు రహదారులపైకి వస్తే, ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తున్నా వారిలో మార్పు రావడం లేదు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పోలీసులు మరింత చొరవ తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: