బిడ్డకు జన్మనిచ్చింది... ఆసుపత్రిలో వదిలేసింది - delivery
తల్లి ప్రేమకు మచ్చ తెచ్చే ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన శిశువును ఆసుపత్రిలోనే వదిలేసి వెళ్లింది ఓ మహిళ.
గుంటూరులో ఓ కన్నతల్లి కర్కశంగా వ్యవహరించింది. పడంటి మగబిడ్డకు జన్మనిచ్చి గుట్టుచప్పుడు కాకుండా ఆసుపత్రిలోనే వదిలేసి వెళ్లిపోయింది. ఈ నెల 25వ తేదీన రాత్రి సమయంలో ఉప్పు శ్రావణి అనే నిండు గర్భిణీ ప్రసవించేందుకు తన తల్లిని తీసుకుని గుంటూరు సర్వజనాసుపత్రికి వచ్చింది. అదే రోజు రాత్రి 2గంటల 30 నిమిషాలకు మగబిడ్డకు జన్మనిచ్చింది. కొద్దిసేపటికి మరుగుదొడ్డికి వెళ్లి వస్తానని చెప్పి ముక్కుపచ్చలారని చిన్నారిని అక్కడే వదిలేసి తల్లితో పాటు పరారైంది. ఘటనపై కొత్తపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తప్పుడు చిరునామాతోనే మహిళ... ఆసుపత్రిలో చేరిందని దర్యాప్తులో తేలింది. బిడ్డ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు.