గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో (జీజీహెచ్) కరోనా రోగులకు పడకలు కేటాయించేందుకు ముడుపులు గుంజుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆసుపత్రిలో కరోనా బాధితులకు సాధ్యమైనంత మేర పీజీ వైద్య విద్యార్థుల చేతుల మీదుగానే సేవలు అందుతున్నాయి. వారు వార్డుల్లో రౌండ్స్‌కు వెళ్లి ఆరోగ్యం కుదుటపడిన రోగులను గుర్తించి డిశ్ఛార్జ్ సమ్మరీ సిద్ధం చేయాలని స్టాఫ్ నర్సులకు సూచిస్తుంటే కొందరు బాధితులు తాము రూ.40వేల నుంచి రూ.50వేలు ఇచ్చి బెడ్ పొందామని, అప్పుడే ఎలా డిశ్ఛార్జ్ చేస్తారని వాదనకు దిగుతుండటం ఇక్కడ జరుగుతున్న దందాకు నిదర్శనం. సగటున ప్రతి వార్డులోనూ ఐదారుగురు రోగులు ఇలా దొడ్డిదారిన వచ్చి చేరారని తెలుసుకున్న పీజీ వైద్యులు ఆసుపత్రి ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేయడం గమనార్హం. సోమవారం ఓ రోగిని వార్డుకు మార్చేందుకు ఎంఎన్‌ఓగా పనిచేస్తున్న బొబ్బిలి శ్రీనివాసరావు రూ.3 వేలు డిమాండ్ చేస్తున్నప్పుడు చిత్రీకరించిన వీడియో ఒకటి వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది. ‘వారికి ఏకంగా ఐసీయూ వార్డుల్లో ఎలా ప్రవేశం కల్పిస్తున్నారు? రోగి బంధువులు వచ్చి తమకు ఐసీయూలో పలానా నంబరు బెడ్ కేటాయించారని చెబుతున్నారు’ అని పీజీ వైద్యుడొకరు ఆసుపత్రిలో జరుగుతున్న ఈ తతంగాన్ని వివరించారు. అయితే ఇక మీదట ప్రవేశాన్ని నిర్ధారిస్తూ ఓపీలో ఉండే డాక్టర్లు కేస్ షీట్‌పై సంతకం చేసి, స్టాంప్ వేస్తేనే రోగిని చేర్చుకోవాలని సోమవారం పీజీ వైద్యులకు ఆసుపత్రి అధికారవర్గాలు సమాచారం పంపడం గమనార్హం. మరోవైపు పఠాన్‌ఖాన్ అనే మరో రోగి తనకు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు నాలుగు చేసి రిజిస్టర్‌లో మాత్రం 5 చేసినట్లు ఉండడాన్ని ఆయన గమనించి వైద్య సిబ్బందిని ప్రశ్నించారు. దీంతో తనకు మందులు ఇవ్వడం లేదని, న్యాయం చేయాలని బంధువుల ద్వారా ‘స్పందన’లో ఫిర్యాదు చేయించారు. స్పందించిన గుంటూరు పశ్చిమ తహసీల్దార్ దీనిపై నివేదిక ఇవ్వాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను కోరారు.
డబ్బులు డిమాండ్ చేసిన ఉద్యోగిపై వేటు
ఓ రోగి నుంచి డబ్బులు డిమాండ్ చేసిన వీడియో చక్కర్లు కొట్టడంపై జాయింట్ కల్టెకర్ ప్రశాంతి స్పందించారు. వెంటనే ఆసుపత్రి ఉన్నతాధికారులకు ఫోన్ చేసి సంబంధిత ఉద్యోగిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభావతి మాట్లాడుతూ డబ్బులు డిమాండ్ చేసిన నాలుగో తరగతి ఉద్యోగి శ్రీనివాసరావుని సస్పెండ్ చేశామన్నారు.
కరోనా విజృంభణ వేళ.. జీజీహెచ్‌లో పడకలకు ముడుపుల భాగోతం - గుంటూరులో కరోనా పడకకు డబ్బులు డిమాండ్
కరోనా ఓ వైపు విలయతాండవం చేస్తుంటే.. గుంటూరు జీజీహెచ్‌లో మాత్రం పడకల కోసం వసూళ్లూ కొనసాగుతున్నాయి. కరోనా బాధితులకు కేటాయించాల్సిన పడకలకు ఆ ఆసుపత్రిలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఓ రోగి వద్ద ఆసుపత్రి సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తున్న వీడియో బయటకు పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
money demand corona bed
ఇదీ చదవండి:కరోనా కల్లోలం..ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి !